Share News

పాడి.. వ్యాధులతో అల్లాడి

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:36 AM

మండలంలోని కొండ గోకిరి పంచాయతీ పాడి గ్రామం వ్యాధులతో వణికిపోతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో జనం అల్లాడిపోతున్నారు. పలువురు మూత్ర పిండాల వ్యాధితో మృతి చెందగా, కొందరు డయాలసిస్‌ చేయించుకుంటూ మంచానికే పరిమితమయ్యారు. వ్యాధులు రావడానికి గల కారణాలను అధికారులు కనుగొని తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పాడి.. వ్యాధులతో అల్లాడి
కదల్లేని స్థితిలో ఉన్న జగ్గారావు

- కిడ్నీ సంబంధిత వ్యాధులతో గ్రామస్థులు విలవిల

- నీటి సమస్య కారణంగా సతమతం

- పలువురు మృత్యువాత, కొందరు మంచం పట్టిన వైనం

- డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు మరికొందరు

- సరైన రహదారి సౌకర్యం లేక ఆస్పత్రికి వెళ్లాలంటే ఇబ్బందులు

కొయ్యూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండ గోకిరి పంచాయతీ పాడి గ్రామం వ్యాధులతో వణికిపోతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో జనం అల్లాడిపోతున్నారు. పలువురు మూత్ర పిండాల వ్యాధితో మృతి చెందగా, కొందరు డయాలసిస్‌ చేయించుకుంటూ మంచానికే పరిమితమయ్యారు. వ్యాధులు రావడానికి గల కారణాలను అధికారులు కనుగొని తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పాడి గ్రామంలో సుమారు 120 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామంలో రెండు మంచినీటి బోర్లు, ఒక రక్షిత మంచినీటి పథకం ఉన్నాయి. వీటిలో ఒక బోరు నుంచి వచ్చే నీరు కలుషితమైనట్టు పరీక్షల్లో తేలడంతో ఏడాది కాలంగా ఆ బోరు నీరు వాడడం మానేశారు. రక్షిత మంచినీటి పథకానికి ఏర్పాటు చేసిన ట్యాంకును శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన మెట్లు సీసీ రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించడంతో గతనాలుగేళ్లుగా ట్యాంకును శుభ్రం చేయడం లేదు. దీంతో ట్యాంకు నుంచి వచ్చే నీరు దుర్వాసన వస్తున్నాయి. ఇక గ్రామంలో ఉన్న ఒక్క బోరు నుంచి వచ్చే నీరు ఎర్ర రంగులో దుర్వాసనతో వస్తుండడంతో విధి లేక ఆ నీటినే గ్రామస్థులు వినియోగిస్తున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. గత మూడేళ్లలో గ్రామానికి చెందిన మచ్చల సింహాద్రి, వనపల బంగారయ్య, గమధం రాంబాబు, లక్ష్మయ్య, నడిగట్ల నూకరాజు, అప్పలస్వామిలకు కాళ్లు, చేతులు వాపులు వచ్చి కిడ్నీలు పాడైపోయి సకాలంలో వైద్య సేవలు పొందక మృతి చెందారు. వీరంతా 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హం. ప్రస్తుతం గ్రామానికి చెందిన నడిగట్ల లక్ష్మణరావు(50), అడ్డూరి జగ్గారావు(40), లోచల గంగయ్యమ్మ(48), జంపా చిన్నబ్బాయి(45)లు కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడి వారానికి రెండు పర్యాయాలు డయాలసిస్‌ చేయించుకుంటూ మంచాలపై మగ్గుతున్నారు. వీరు కాకుండా మరికొంత మంది కాళ్లు, చేతులు వాపులతో ఇబ్బందులు పడుతున్నారు.

సరైన రహదారి లేక ఇబ్బందులు

డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు రాత్రి సమయాల్లో ఊపిరి అందక బాధపడుతున్నా అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించేందుకు ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే సరైన రహదారి సౌకర్యం లేదు. గ్రామానికి అర కిలోమీటరు ముందు కొండవాగు ప్రవాహంపై నిర్మించిన వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిఽథిలం కావడంతో రహదారి సౌకర్యం కొరవడింది. అలాగే డయాలసిస్‌కు వారానికి రెండు పర్యాయాలు(మంగళవారం, శుక్రవారం) పాడి నుంచి 35 కిలోమీటర్లు దూరంలో గల నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. దీనికి తోడు రోగులకు ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చుకుని అదనంగా మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రతి నెలా వీరికి ఇస్తున్న రూ.10 వేల పింఛను ఏ మాత్రం చాలడం లేదు. వీరంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి గ్రామంలో వ్యాధులు ప్రబలడానికి కారణాలను గుర్తించడంతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:36 AM