Share News

పాడేరు...తీరే వేరు

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:14 AM

దశాబ్దాలుగా ఏజెన్సీకి, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేంద్రంగా ఉన్న పాడేరు ఓటర్లు అన్ని పార్టీలను ఆదరిస్తూ వస్తున్నారు.

పాడేరు...తీరే వేరు

మొత్తం ఓటర్లు 2,44,925

మహిళలు 1,18,154

పురుషులు 1,26,755

ఇతరులు 16

అన్ని రాజకీయ పార్టీలను ఆదరిస్తున్న నియోజకవర్గ ఓటర్లు

1967లో ఆవిర్భావం

ఇప్పటివరకూ పన్నెండుసార్లు ఎన్నికలు

ఐదుసార్లు కాంగ్రెస్‌, మూడుసార్లు

తెలుగుదేశం, రెండుసార్లు వైసీపీ గెలుపు

బీఎస్‌పీ, జనతా పార్టీలు ఒక్కొక్కసారి...

ఒక్కసారి మినహా భగత తెగకు చెందిన వారే గెలుపు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

దశాబ్దాలుగా ఏజెన్సీకి, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేంద్రంగా ఉన్న పాడేరు ఓటర్లు అన్ని పార్టీలను ఆదరిస్తూ వస్తున్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం 1967 ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ పన్నెండుసార్లు ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు, మూడుసార్లు టీడీపీ అభ్యర్థులు, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు, బీఎస్పీ, స్వతంత్ర, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కసారి గెలుపొందారు.

గతంలో గొలుగొండ నియోజకవర్గం పరిధిలో...

ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న పాడేరు, గతంలో గొలుగొండ నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1952లో పాడేరు, చింతపల్లి ప్రాంతాలు గొలుగొండ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేవి. కొన్నాళ్ల తర్వాత గూడెంకొత్తవీధి అసెంబ్లీ నియోజకవర్గంలో పాడేరు, చింతపల్లి ప్రాంతాలను కొనసాగించారు. 1962లో చింతపల్లిని ప్రత్యేకంగా నియోజకవర్గంగా విభజించి, పాడేరు ప్రాంతాన్ని అందులోనే ఉంచారు. 1967లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఆ తరువాత కాలంలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు కలిపి పాడేరు నియోజకవర్గంగా, జీకేవీధి, కొయ్యూరు, చింతపల్లి, నాతవరం, గొలుగొండ మండలాలు కలిపి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేవి.

1967 నుంచి 2004 వరకూ నియోజకవర్గ పరిధిలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు ఉండేవి. 2009లో పునర్విభజన తర్వాత పాడేరు నియోజకవర్గ పరిధిలో కొత్తగా చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలు వచ్చి చేరాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు అరకులోయ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిపోయాయి. అప్పటికి నియోజక వర్గంలో సుమారు 1,94,000 మంది ఓటర్లు ఉండేవారు. కానీ ఆ తరువాత ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 2,44,922 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,18,154 మంది పురుషులు, మహిళలు 1,26,755 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన గిడ్డి ఈశ్వరికి, వైసీపీ అభ్యర్థిగా ఉన్న విశ్వేశ్వరరాజుకు మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది.

నియోజకవర్గంలో భగత తెగదే ఆధిపత్యం

పాడేరు నియోజకవర్గంలో 1967 నుంచి ఒక్కసారి (2009) మినహా 2019 వరకూ భగత తెగకు చెందినవారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. భగత తెగకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడం, ఇతర తెగలకు ఓటింగ్‌పై అవగాహన లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతుంటారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన తీర్పు వచ్చింది. వాల్మీకి తెగకు చెందిన పసుపులేటి బాలరాజు (చింతపల్లి కేంద్రంగా ఉండే నియోజకవర్గం నుంచి అప్పటికే రెండుసార్లు గెలుపొందారు) గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి భగత, కొండదొర, కోందు, వాల్మీకి, కమ్మర తెగలకు చెందిన నేతలు రాజకీయంగా పోటీ పడుతున్నారు.

పాడేరు నుంచి ముగ్గురు మంత్రులు

పాడేరు నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మత్స్యరాస బాలరాజు (కాంగ్రెస్‌) అప్పట్లో రాష్ట్ర స్టేషనరీ, ఉద్యానవన శాఖా మంత్రిగా పనిచేశారు. అలాగే 1999లో ఎమ్మెల్యే అయిన మత్స్యరాస మణికుమారి (టీడీపీ)... చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పసుపులేటి బాలరాజు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల క్యాబినెట్‌లలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు.

2009లో మారిన నియోజకవర్గం స్వరూపం....

2009లో ఏజెన్సీ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపం పూర్తిగా మారిపొయింది. పునర్విభజన వల్ల పాడేరు అసెంబ్లీ స్థానంలోకి పాడేరు, జి.మాడుగుల, జీకేవీధి, కొయ్యూరు మండలాలు, అరకులోయ అసెంబ్లీ స్థానంలోకి అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో పూర్తిగా గిరిజన మండలాలే ఉన్నాయి.

పాడేరు అసెంబ్లీ స్థానంలో విజేతలు, మెజారిటీల వివరాలు.....

సం విజేత పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ

1967 తమర్భ చిట్టినాయుడు కాంగ్రెస్‌ 6,516 పి.రామారావు ఇండి 4,018 2,516

1972 తమర్భ చిట్టినాయుడు కాంగ్రెస్‌ 8074 ఆర్‌పీ పడాల్‌ ఇండి 5,641 2,433

1978 గిడ్డి అప్పలనాయుడు జనతా 12,653 తమర్భ చిట్టినాయుడు కాంగ్రెస్‌ 10,146 2,507

1983 తమర్భ చిట్టినాయుడు కాంగ్రెస్‌ 8,810 శెట్టి లక్ష్మణుడు ఇండిపెండెంట్‌6,342 2,568

1985 కొట్టగుళ్లి చిట్టినాయుడు టీడీపీ 11,342 మత్స్యరాస బాలరాజు కాంగ్రెస్‌ 11,229 113

1989 మత్స్యరాస బాలరాజు కాంగ్రెస్‌ 27,501 మత్స్యరాస వెంకటరాజు టీడీపీ 13,037 14,464

1994 కొట్టగుళ్లి చిట్టినాయుడు టీడీపీ 27,923 మత్స్యరాస బాలరాజు కాంగ్రెస్‌ 15,685 12,238

1999 మత్స్యరాస మణికుమారి టీడీపీ 26,160 లకే రాజారావు బీఎస్‌పీ 21,734 4,426

2004 లకే రాజారావు బీఎస్‌పీ 33,890 ఎస్‌.రవిశంకర్‌ ఇండిపెండెంట్‌26,335 7,555

2009 పసుపులేటి బాలరాజు కాంగ్రెస్‌ 35,653 జి.దేముడు సీపీఐ 35,066 587

2014 గిడ్డి ఈశ్వరి వైసీపీ 52,384 జి.దేముడు సీపీఐ 26,243 26,141

2019 కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ 71,153 గిడ్డి ఈశ్వరి టీడీపీ 26,349 42,804

Updated Date - Apr 23 , 2024 | 02:14 AM