ఖాళీ స్థలాల పన్ను మదింపునకు యజమానులు నిరీక్షణ
ABN , First Publish Date - 2024-02-09T01:05:44+05:30 IST
ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు చెల్లించాలని స్థానిక సంస్థల అధికారులు, ఆయా యజమానులకు నోటీసులు జారీ చేస్తుంటారు. సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుము (వడ్డీ) కూడా విధిస్తుంటారు. కానీ జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ‘ఖాళీ స్థలాలకు పన్నులు (వీఎల్‌టీ) చెల్లించడానికి తాము సిద్ధంగా వున్నాం. ఎంత చెల్లించాలో నోటీసులు ఇవ్వండి మహాప్రభో’ అంటూ స్థలాల యాజమానులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో పేరుకుపోతున్న వీఎల్‌టీ దరఖాస్తులు
రెండు వారాల క్రితం జోనల్ కమిషనర్ బదిలీ
డిజిటల్ సైన్ కీ లాగ్‌అవుట్
అమలాపురం నుంచి కొత్త జోనల్ కమిషనర్ రాక
ఇంతవరకు లాగిన్ కాని డిజిటల్ సైన్ కీ
కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు ప్రదక్షిణ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఆస్తి పన్నులు చెల్లించాలని స్థానిక సంస్థల అధికారులు, ఆయా యజమానులకు నోటీసులు జారీ చేస్తుంటారు. సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుము (వడ్డీ) కూడా విధిస్తుంటారు. కానీ జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ‘ఖాళీ స్థలాలకు పన్నులు (వీఎల్‌టీ) చెల్లించడానికి తాము సిద్ధంగా వున్నాం. ఎంత చెల్లించాలో నోటీసులు ఇవ్వండి మహాప్రభో’ అంటూ స్థలాల యాజమానులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఖాళీ స్థలాలకు పన్ను విధింపులో మునిసిపల్ రెవెన్యూ విభాగం అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎన్నికల బదిలీల హడావుడిలో డిజిటల్ సైన్ కీ ఇంకా రాలేదంటూ ఖాళీ జాగాలకు పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) చెల్లించేందుకు భూ యజమానులు ఆన్‌లైన్‌లో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో వీఎల్‌టీ విధింపు కోసం దరఖాస్తు పెట్టుకున్న అనేక మంది కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో భూముల విలువ గణనీయంగా పెరిగిపోవడంతో ఖాళీ జాగాలపై కన్నేసిన కబ్జాదారులు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి వాటిని ఆక్రమించుకుంటున్నారు. దీంతో స్థలాలను రక్షించుకునేందుకు యజమానులు వీఎల్‌టీ చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. భూ యజమాని రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈసీ, లింకు డాక్యుమెంట్, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారులు వీటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. అన్నీ సక్రమంగా వుంటే ఖాళీ స్థలానికి ఒక అసెస్‌మెంట్ నంబరు జారీ చేస్తారు. దీని ఆధారంగా భూమి మార్కెట్ విలువపై 0.5 శాతాన్ని వీఎల్‌టీగా విధిస్తారు. సంబంధిత భూ యజమాని ఏడాదికి ఒకసారి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అనకాపల్లిలోని ఒక వార్డులో రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల ప్రకారం గజం రూ.15 వేలు వుంటే, వంద గజాలు రూ.15 లక్షలు విలువ చేస్తుంది. దీనిపై అర శాతం పన్ను.. అంటే రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాలకు కనీసం నాలుగు సంవత్సరాలపాటు పన్ను చెల్లించి వుంటే అటువంటి స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలనుకున్నా టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు త్వరగా జారీ అవుతాయి. దీంతో ఖాళీ స్థలాలకు రక్షణతోపాటు భవిష్యత్తులో భవన నిర్మాణాలు చేపడితే త్వరగా అనుమతులు వస్తాయన్న ఉద్దేశంతో వీఎల్‌టీ చెల్లించేందుకు పలువురు దరఖాస్తు చేస్తున్నారు.
పేరుకుపోతున్న వీఎల్‌టీ దరఖాస్తులు
జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో గత రెండు వారాలుగా వీఎల్‌టీ దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. సుమారు 140 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ వెంకటరమణ ఇటీవల సాలూరు మునిసిపాలిటీకి బదిలీ అయ్యారు. వీఎల్‌టీ పన్నులకు సంబంధించిన డిజిటల్ సైన్ కీ లాగ్‌అవుట్ అయ్యారు. ఆయన స్థానంలో అమలాపురం మునిసిపాలిటీ నుంచి అధికారిని నియమించారు. ఇతను విధుల్లో చేరడంలో జాప్యం జరిగింది. అంతేకాక డిజిటల్ కీ లాగిన్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు తెలిసింది. ఈ విషయం తెలియక పలువురు దరఖాస్తుదారులు జీవీఎంసీ రెవెన్యూ విభాగానికి వెళ్లి పెండింగ్ దరఖాస్తుల గురించి ప్రశ్నిస్తే.. డిజిటల్ కీ ఇంకా లాగిన్ కాలేదని బదులిస్తున్నారు. దీనిపై కొత్త జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐ.అయ్యప్పనాయుడును వివరణ కోరగా.. డిజిటల్ కీ రెండు, మూడు రోజుల్లో వస్తుందని, లాగిన్ కాగానే వీఎల్‌టీ దరఖాస్తులన్నిటిని క్లియర్ చెస్తామని చెప్పారు.