Share News

ఇష్టారాజ్యంగా చేపల చెరువులు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:49 PM

మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు చేపల చెరువులను దర్జాగా నిర్వహిస్తు న్నారు. చేపలు ఏపుగా పెరగడానికి కోళ్లు, పశు మాంస వ్యర్థాలను చెరువుల్లో వేస్తున్నారు. దీంతో నీళ్లు కలుషితమై సమీపంలోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది.

ఇష్టారాజ్యంగా చేపల చెరువులు
చేపల చెరువులు

అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్వహణ

పంట భూములను లీజుకు తీసుకుని చేపల పెంపకం

కోళ్లు, పశు మాంసం వ్యర్థాలే ఆహారం

చేపలు వేగంగా, ఏపుగా పెరగడానికి వినియోగం

నీళ్లు కలుషితమై దెబ్బతింటున్న సమీపంలోని పంట పొలాలు

పట్టించుకోని అధికారులు

దేవరాపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు చేపల చెరువులను దర్జాగా నిర్వహిస్తు న్నారు. చేపలు ఏపుగా పెరగడానికి కోళ్లు, పశు మాంస వ్యర్థాలను చెరువుల్లో వేస్తున్నారు. దీంతో నీళ్లు కలుషితమై సమీపంలోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానా లకు తావిస్తోంది.

మండలంలోని పలు గ్రామాల్లో సుమారు ఆరేళ్ల క్రితం వ్యవసాయ భూముల్లో చేపల చెరువులు వెలిశాయి. మండల కేంద్రం దేవరాపల్లి, సంజీవపురం, పెదనందిపల్లి, చేనుల పాలెం, మారేపల్లి, తారువ, తిమిరాం, కలిగొట్ల, కొత్తపెంట, ములకలాపల్లి, ఎన్‌.గజపతినగరం, మామిడిపల్లి గ్రామాల్లో చేపలు చెరువులు ఉన్నాయి. ఇవన్నీ రైవాడ జలాశయం కింద ఆయకట్టు భూములే. మండలంలో సుమారు రెండు వందలకు పైగా ఎకరాల్లో చేపలు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో పంగస్‌(జెల్ల) రకం చేపలు పెంచుతున్నారు. అయితే పంట భూములను చెరువులుగా మార్చి చేపలు పెంచడానికి మత్స్యశాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంది. అయితే ఎటువంటి అను మతులు తీసుకోకుండా కొందరు చేపల చెరువుల కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఎకరా భూమికి సంవత్సరానికి రూ.50 వేలు నుంచి రూ.70 వేలు రైతుకు ఇచ్చి ఐదు సంవత్సరాల చొప్పున కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల వ్యాపారులు లీజుకు తీసుకుని చేపల చెరువులు నిర్వహిస్తున్నారు.

చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు

వాస్తవానికి చేపల పెంపకానికి అన్నం, తవుడు వంటివి వేయాల్సి ఉంది. అయితే చేపలు వేగంగా, ఏపుగా పెరగడానికి నిబంధనలకు విరుద్ధంగా కోళ్లు, పశు మాంస వ్యర్థాలను వేస్తున్నారు. ఈ వ్యర్థాలను విశాఖ, అనకాపల్లి, జీవీఎంసీ పరిసరాల నుంచి తెచ్చి వేస్తున్నారు. రైవాడ ఆయకట్టుకు నీరు విడుదల చేసినప్పుడు ఆ నీటిని చేపల చెరువులకు మళ్లిస్తున్నారు. కాగా చేపల చెరువుల్లోని వ్యర్థ జలాలను బయటకు విడిచిపెడుతుండడంతో సమీపంలోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. చేపల చెరువుల నిర్వహణకు మత్స్యశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకపోవడం, అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

చేపల చెరువులకు అనుమతులు లేవు

చేపల చెరువుల నిర్వహణకు ఎవరూ అనుమతులు తీసుకోలేదని, అనుమతులు తీసుకోవాలని 15 మంది చేపల చెరువుల యజమానులకు నోటీలు ఇచ్చామని మత్స్య శాఖ ఏడీ ప్రసాదరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇటీవల తారువలో కోళ్ల వ్యర్థాలను పట్టుకొనిఽ వాటిని ధ్వంసం చేసి రవాణా చేస్తున్న ఆటోను పోలీసులకు అప్పగించామన్నారు. ఇక్కడ పెంచుతున్న చేపలు పంగస్‌ రకానికి చెందినవి ఆయన తెలిపారు.

అధికారులు పట్టించుకోవడం లేదు

చేపల చెరువులపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న ఆరోపించారు. కోళ్ల వ్యర్థాలను పట్టపగలే మాంసం దుకాణాల నుంచి తీసుకు వెళుతుంటే పట్టుకొని పోలీసులకు అప్పగించాల్సి వస్తుందన్నారు. సచివాలయాల సిబ్బంది కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 22 , 2024 | 11:49 PM