Share News

ఖరీఫ్‌కు కార్యాచరణ సిద్ధం

ABN , Publish Date - May 26 , 2024 | 12:50 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణను జిల్లా వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం వేసవి దుక్కి పనులు చేపడుతుండడంతో మరో పది రోజుల్లో గిరిజన రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఖరీఫ్‌కు కార్యాచరణ సిద్ధం
జి.మాడుగుల మండలం బీరం ప్రాంతంలో వేసవి దుక్కి పనుల్లో గిరిజన రైతు

- మరో పది రోజుల్లో రైతులకు 90 శాతం రాయితీ విత్తనాల పంపిణీ

- వేసవి దుక్కి పనులు చేస్తున్న గిరిజన రైతులు

- జిల్లాలో 23,840 క్వింటాళ్లు వరి, 141 కింటాళ్లు రాగులు, 364 క్వింటాళ్ల అపరాలు, 4,500 క్వింటాళ్లు రాజ్‌మా, 648 క్వింటాళ్లు వేరుశగన పంపిణీకి చర్యలు

- తాజా వర్షాలు ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణను జిల్లా వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం వేసవి దుక్కి పనులు చేపడుతుండడంతో మరో పది రోజుల్లో గిరిజన రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఖరీఫ్‌లో భాగంగా గిరిజన రైతులకు అవసరమైన విత్తనాలను ఏ మేరకు పంపిణీ చేయాలనే అంశంపై కార్యాచరణను జిల్లా వ్యవసాయాధికారులు రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలో 23,840 క్వింటాళ్లు వరి, 141 కింటాళ్లు రాగులు, 364 క్వింటాళ్ల అపరాలు, 4,500 క్వింటాళ్లు రాజ్‌మా, 648 క్వింటాళ్లు వేరుశగన విత్తనాలను 90 శాతం రాయితీ పంపిణీకి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. భూసారం పెంపు, పంటల్లో అధిక దిగుబడి కోసం పచ్చిరొట్ట ఎరువులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో జనుము 747 క్వింటాళ్లు, పిల్లిపెసర 401 క్వింటాళ్లు అవసరమని గుర్తించారు.

వేసవి దుక్కి పనుల్లో గిరిజన రైతులు

గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులు వేసవి దుక్కి పనుల్లో బిజీగా ఉన్నారు. వేసవిలో కురిసిన వర్షాలకు పంట భూములు కొంతమేరకు మెత్తబడతాయి. దీంతో వేసవి దుక్కి పనులు చేపడితే ప్రధానమైన దుక్కి పనులకు పెద్ద సమస్య ఉండదు. అందుకోసమే ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు వేసే రైతులు విధిగా వేసవి దుక్కి పనులు చేపడతారు. ఈ పనులు పూర్తయిన తరువాత జూన్‌ నెలలో పంట భూముల్లో సేంద్రీయ ఎరువును వేసి ఆఖరి దుక్కి పనులు పూర్తి చేసుకుని, వరి నారు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు. నారు పూర్తిగా సిద్ధమైతే వరి నాట్లు వేస్తారు. ఏజెన్సీలో ఖరీఫ్‌లో అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేస్తుండగా, మిగిలిన రాగులు, వేరుశనగ, అవసరాలు, రాజ్‌మా వంటివి కొంత మేరకు పండిస్తారు. అధికారులు సైతం మరో వారం పది రోజుల్లో 90 శాతం రాయితీపై గిరిజన రైతులకు అవసరమైన విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాయితీ విత్తనాల కోసం సంబంధిత వ్యవసాయాధికారులు, రైతు భరోసా కేంద్రాలను రైతులు సంప్రతించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తరచూ వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుందని అన్నదాతలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌లో సాగయ్యే పంటల వివరాలు

- వరి 59,189 హెక్టార్లు

- అపరాలు 2,820 హెక్టార్లు

- నూనె గింజలు 1,405 హెక్టార్లు

- ఇతర పంటలు 38,695 హెక్టార్లు

Updated Date - May 26 , 2024 | 12:50 AM