Share News

7.74 శాతమే!

ABN , Publish Date - May 20 , 2024 | 12:27 AM

జిల్లాలో అత్యధిక ఓట్లున్న విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు పోలింగ్‌లో వెనుకబడ్డాయి.

7.74 శాతమే!

విమాననగర్‌ బూత్‌లో నమోదైన పోలింగ్‌

ఎన్నికలకు దూరంగా నేవీ కుటుంబీకులు

నేవీ క్వార్టర్స్‌లో 50 శాతం కంటే తక్కువగా పోలింగ్‌

అత్యధికంగా గోపాలపట్నం ఇంద్రానగర్‌లో 88.55 శాతం

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్‌ సరళి

గోపాలపట్నం/మల్కాపురం, మే 19:

జిల్లాలో అత్యధిక ఓట్లున్న విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు పోలింగ్‌లో వెనుకబడ్డాయి. ముఖ్యంగా నేవీ కుటుంబాలు ఉండే క్వార్టర్స్‌ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన బూత్‌లలో 50 శాతం కంటే తక్కువగా ఓటింగ్‌ జరిగింది. విమానాశ్రయం ఎదురుగా ఐఎన్‌ఎస్‌ డేగాలో పనిచేసే ఉద్యోగులు ఉండే విమాననగర్‌లో కేవలం 7.74శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. విమాననగర్‌ కోసం ఏర్పాటుచేసిన బూత్‌ నంబరు 213లో 620 మంది ఓటర్లుండగా కేవలం 48మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బహుశా ఇక్కడే రాష్ట్రంలో అతి తక్కువ పోలింగ్‌ జరిగిందని చెబుతున్నా, అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.

ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 222 పోలింగ్‌ బూత్‌లలో 2,13,439మంది ఓటర్లకుగాను 1,48,942 మంది ( 69.78 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్‌ల వారీగా ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే.. నేవీ కుటుంబీకులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. మర్రిపాలెం 104 ఏరియాలో ఉన్న బూత్‌ నంబరు 194లో 424మంది ఓటర్లకు 154 (36.32శాతం)మంది, మేహాద్రిపేట ప్రాంతంలో ఉన్న బూత్‌ నంబరు 171లో 375 మంది ఓటర్లకు 137 మంది (36.53శాతం), అశోకాపార్కు ఏరియాలో ఏర్పాటు చేసిన బూత్‌ నంబరు 178లో 274 మందికి 113 (41.24శాతం), మల్కాపురం నేవీ ఏరియాలో ఉన్న బూత్‌ నంబరు 160లో 466మంది ఓటర్లకు 200 మంది(42.92శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 50శాతం కంటే తక్కువగా ఏడుచోట్ల పోలింగ్‌ నమోదయింది. కాగా 51 నుంచి 60శాతం మధ్య 30 పోలింగ్‌ బూత్‌లు, 61 నుంచి 70శాతం మధ్య 62 బూత్‌లు, 71 నుంచి 80 శాతం మధ్య 98 పోలింగ్‌ బూత్‌లు, 80 శాతం దాటి 25 పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు పడ్డాయి.

అత్యధికంగా గోపాలపట్నం ఇంద్రానగర్‌ బూత్‌ నంబరు 13లో 88.55 శాతం ఓటింగ్‌ జరిగింది. ఇంకా గవర కంచరపాలెంలో బూత్‌ నంబరు 191లో 88.2 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుండగా కంచరపాలెంలోని ఐటీఐ జంక్షన్‌లో హ్యాపీ ఓమ్స్‌, మర్రిపాలెం, కాకానినగర్‌, మల్కాపురంలో అపార్టుమెంట్‌ ప్రాంతాలకు చెందిన బూత్‌లలో పోలింగ్‌ శాతం తగ్గిందని రాజకీయపార్టీల ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 12:27 AM