Share News

కొనసాగుతున్న వర్షాలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:16 AM

మన్యంలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం సైతం మన్యంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయడం, ఆ తరువాత వర్షం కురవడం పరిపాటిగా మారింది.

కొనసాగుతున్న వర్షాలు
గూడెంకొత్తవీధిలో వర్షం

జీకేవీధిలో కూలిపోయిన పాఠశాల రేకుల షెడ్డు

లోతట్టు ప్రాంతాలు జలమయం

జనజీవనానికి అంతరాయం

పాడేరు, మే 20(ఆంధ్రజ్యోతి): మన్యంలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం సైతం మన్యంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయడం, ఆ తరువాత వర్షం కురవడం పరిపాటిగా మారింది. పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తాజా వర్షానికి రోడ్లన్నీ చిత్తడికాగా, పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరుతున్నది. దీంతో వేసవి దుక్కి పనులకు తాజా వర్షాలు అనుకూలంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గూడెంకొత్తవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో పలు చోట్ల సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండి, సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మండల కేంద్రంతో పాటు సీలేరు, ధారకొండ, సప్పర్ల, లక్కవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లక్కవరంలో భారీ వర్షానికి ప్రాథమిక పాఠశాల రేకుల షెడ్డు కూలిపోయింది. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు కావడంతో పెనుప్రమాదం తప్పింది.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండల వ్యాప్తంగా సోమవారం మధ్యా హ్నం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షానికి ఊరట చెందారు.

పెదబయలులో..

పెదబయలు: మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షం ధాటికి వారపు సంత వెలవెలబోయింది. మధ్యాహ్నం కురిసిన వర్షానికి వారపు సంతకు వచ్చిన కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. దీంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు.

Updated Date - May 21 , 2024 | 12:16 AM