Share News

కొనసాగుతున్న పోలీసు తనిఖీలు

ABN , Publish Date - May 29 , 2024 | 12:55 AM

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఎస్పీ కేవీ మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.

కొనసాగుతున్న పోలీసు తనిఖీలు
అనకాపల్లి మండలం శంకరంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు

- కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌లో 818 వాహనాల తనిఖీ

- జిల్లాలో 157 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు స్వాధీనం

అనకాపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఎస్పీ కేవీ మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయనున్నాయి. జూన్‌ 4న అనకాపల్లిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌ ద్వారా ఎటువంటి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ పోలీసు సబ్‌ డివిజన్‌లోని 30 పోలీసు స్టేషన్‌ల పరిధిలో 20 వేర్వేరు ప్రదేశాల్లో పోలీసు బృందాలు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ తనిఖీలు నిర్వహించాయి. ఇప్పటి వరకు 818 వాహనాలను తనిఖీ చేసి, ఎటువంటి పత్రాలు లేని 157 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు పట్టుబడిన సందర్భంలో సంబంధిత పత్రాలు లేకపోయినా తరువాత పోలీసు స్టేషన్‌లో వాటిని చూపిస్తే వాహనాలను తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు.

కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు తనిఖీలు

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేవరకు జిల్లాలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ తనిఖీలు కొనసాగునున్నాయని ఎస్పీ కేవీ మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా కొనసాగుతుందని, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేసే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపడుతు న్నామని ఎస్పీ తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 12:55 AM