నియోజకవర్గంలో లక్ష ఉద్యోగాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:05 AM
నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నందున, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో సుమారు లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం స్థానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాను హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏర్పాటుచేసిన ఈ జాబ్‌మేళాలో 50 కంపెనీలుపైగా పాల్గొంటున్నందున ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నానన్నారు.

- పెద్ద సంఖ్యలో కంపెనీలు రానున్నాయి
- మరో మూడు నెలల్లో మరోసారి మెగా జాబ్‌మేళా
- త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
- హోం మంత్రి వంగలపూడి అనిత
పాయకరావుపేట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నందున, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో సుమారు లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం స్థానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాను హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏర్పాటుచేసిన ఈ జాబ్‌మేళాలో 50 కంపెనీలుపైగా పాల్గొంటున్నందున ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నానన్నారు. ఒకవేళ రాకుంటే నిరాశ పడవద్దని, మరో మూడు నెలల్లో మరో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో నియోజకవర్గానికి ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు పెద్ద సంఖ్యలో కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ముఖ్యంగా స్టీల్‌ప్లాంట్ రాబోతోందని, అదే విధంగా నియోజకవర్గం ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోందని, కేంద్రం నిధులు సుమారు వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటవుతున్నందున సుమారు వంద కంపెనీలు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో సుమారు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికులు సిద్ధ్దం చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్‌కృష్ణన్, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, జాబ్స్ జిల్లా మేనేజర్ కళ్యాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గోవిందరావు, శ్రీప్రకాశ్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, నాలుగు మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ జాబ్‌మేళాలో 53 జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంతోపాటు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత తరలివచ్చారు. 2,750 మంది అభ్యర్థులు హాజరుకాగా, 826 మంది ఎంపికయ్యారు. వీరిలో 300 మందికి అప్పటికప్పుడే ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.