Share News

కాఫీ పూతపై... భానుడి మోత!

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:22 AM

ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడం, వేసవి ఆరంభం నుంచే భానుడి ప్రతాపం కాఫీ పూతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈఏ డాది మార్చి, ఏప్రిల్‌లో వర్షాలు కురవకపోవడం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పూత మొగ్గ దశలోనే మాడిపోతున్నది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని గిరిజన రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కాఫీ పూతపై... భానుడి మోత!
మొగ్గ దశలోనే మాడిపోతున్న కాఫీ పూత

తీవ్ర ఎండలకు మాడిపోతున్న వైనం

దిగుబడులపై తీవ్ర ప్రభావం

ఆందోళనలో గిరిజన రైతాంగం

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 13:

ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడం, వేసవి ఆరంభం నుంచే భానుడి ప్రతాపం కాఫీ పూతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈఏ డాది మార్చి, ఏప్రిల్‌లో వర్షాలు కురవకపోవడం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పూత మొగ్గ దశలోనే మాడిపోతున్నది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని గిరిజన రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

జిల్లాలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర వాణిజ్య పంటగా సుమారు 2.8లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు.ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో గిరిజన ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. ఇలాంటి వాతావరణమే కాఫా సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్థారించారు. దీంతో గత 45 ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో కాఫీ సాగు విస్తరిస్తున్నది.ప్రస్తుతం గిరిజన ప్రాంత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మే, జూన్‌ నెలల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. మిగిలిన రోజుల్లో 35, 36 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. అయితే ఈఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలోనే 37, 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కాఫీ పంటకు నష్టం కలిగిస్తున్నది. సాధారణంగా మార్చిలో కురిసిన వర్షాలకు కాఫీ విస్తారంగా వస్తుంది. ఈఏడాది వర్షాలు లేక పూతరాలేదు. కొన్ని తోటల్లో పూత వచ్చినప్పటికీ ఎండ తీవ్రతకు మాడిపోయి రాలిపోతున్నది. గిరిజన ప్రాంత రైతులు కాఫీ పంటను వర్షాధార పంటగా సాగుచేస్తున్నారు. పూత దశలో వర్షాలు లేక దిగుబడులపై నిరాశచెందుతున్నారు.

వాతావరణంలో భారీ మార్పు..

గిరిజన ప్రాంత వాతావరణంలో భారీ మార్పు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మార్చిలో సాధారణ వర్షపాతం 28 మి.మీ., ఏప్రిల్‌లో 76 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సివున్నది. గత ఏడాది మార్చిలో గరిష్ఠంగా 116 మి.మీ.. ఏప్రిల్‌లో 69 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈఏడాది మార్చిలో ఒక రోజు మాత్రమే చిరుజల్లులు కురవడంతో అత్యల్పంగా 3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏప్రిల్‌ సగానికి వచ్చినప్పటికీ చినుకు జాడలేదు. గత పదేళ్లలో మార్చిలో వర్షాలు కురవపోవడం ఇదే ప్రథమమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వర్షం పడకుంటే పంట పోయినట్టే

రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈఏడాది కాఫీ పంటను నష్టపోవాల్సివస్తుంది. కాఫీ పండ్లు సేకరణ ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వర్షం కూడా పడలేదు. గిరిజన రైతులకు కాఫీ ప్రధాన ఆదాయ పంట. దిగుబడులు రాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

- గుంజా బాలయ్య, వాడమామిడి.

మార్చి, ఏప్రిల్‌ వర్షాలు కీలకం

కాఫీ పంటకు మార్చి, ఏప్రిల్‌లో కురిసే వర్షాలే చాలా కీలకం. ఈ ఏడాది మార్చిలో వర్షాలు కురకవపోవడం వల్ల కాఫీ పూత ప్రారంభంకాలేదు. ఈనెలలో వర్షాలు కురిస్తే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాలు పడకపోతే కాఫీ దిగుబడులుపై తీవ్ర ప్రభావం పడుతుంది.

- డాక్టర్‌ శివకుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి.

Updated Date - Apr 14 , 2024 | 12:22 AM