Share News

కైలాసగిరిపై స్కై సైక్లింగ్‌, జిప్‌ లైనర్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:33 AM

ఎప్పటి నుంచో ఊరిస్తున్న అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ కైలాసగిరిపై అందుబాటులోకి వచ్చాయి. జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌ రెండింటినీ బుధవారం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌ కలిసి ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రణవ్‌గోపాల్‌, విశ్వనాథన్‌ ఇద్దరూ జిప్‌ లైనర్‌ ఎక్కారు.

కైలాసగిరిపై  స్కై సైక్లింగ్‌, జిప్‌ లైనర్‌

ఉదయం 9.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో...

ఒకటే అయితే రూ.300, రెండూ కలిపి రూ.500

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

ఎప్పటి నుంచో ఊరిస్తున్న అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ కైలాసగిరిపై అందుబాటులోకి వచ్చాయి. జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌ రెండింటినీ బుధవారం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌ కలిసి ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రణవ్‌గోపాల్‌, విశ్వనాథన్‌ ఇద్దరూ జిప్‌ లైనర్‌ ఎక్కారు.

ఆర్‌జే అడ్వంచర్స్‌ సంస్థ మరో భాగస్వామి బీఎంవీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ కింద పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.2 కోట్లతో వీటిని ఏర్పాటుచేసింది. కైలాసగిరిపై శివపార్వతుల విగ్రహానికి ఎడమ వైపున వీటిని ఏర్పాటుచేశారు. జిప్‌లైనర్‌ వెళ్లడానికి ఒక మార్గం, అటు వైపు నుంచి తిరిగి వెనక్కి రావడానికి మరో మార్గం పెట్టారు. అటువైపు పెద్ద టవర్‌ నిర్మించి, ఇటు నుంచి వెళ్లిన వారిని అక్కడ దించిన తరువాత టవర్‌లో మరికొంత పైకి తీసుకువెళ్లి ఇంకొక మార్గం ద్వారా వెనక్కి పంపుతున్నారు. ఇక స్కై సైక్లింగ్‌ విషయానికి వస్తే దానికి ఒకటే మార్గం పెట్టారు. ఇటు నుంచి వెళ్లిన తరువాత అక్కడ సైకిల్‌ను ఇటు వైపునకు తిప్పి వచ్చిన చోటకు పంపుతున్నారు. వీటికి ఒక్కో దానికి రూ.300 టిక్కెట్‌ ధర నిర్ణయించారు. ఈ రెండింటినీ ఉపయోగించుకోవాలనుకుంటే రూ.500 తీసుకుంటారు. ఇవి ఉదయం 9.30 నుంచి రాత్రి ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రారంభ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ జాయింట్‌ కమిషనర్‌ కె.రమేశ్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:33 AM