Share News

హడలిపోతున్న అధికారులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:21 AM

‘‘విశాఖపట్నంలో భూముల విలువ పెరిగింది.

హడలిపోతున్న అధికారులు

భూ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు అత్యధికం

నేను వచ్చానంటే పని చేసిపెట్టాల్సిందేనని రంకెలు వేసిన ఒక నేత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘విశాఖపట్నంలో భూముల విలువ పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటికి సహకరించాల్సిందిగా అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. కొందరైతే బెదిరిస్తున్నారు. మా వద్ద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి కూడా కొందరు అధికారులు ఈ సమస్య తీసుకువెళ్లారు’’

- విలేకరుల సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌.

అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లను జిల్లాలో ప్రభుత్వ అధికారులు తట్టుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన సహకారం, భరోసా లభించడం లేదు. వారిదీ అదే పరిస్థితి. అయినప్పటికీ బయటపడడం లేదు. తహసీల్దార్‌ రమణయ్య హత్యతో ఇలాంటి విషయాలను అధికారులు మిత్రుల వద్ద చెప్పుకొని వాపోతున్నారు. ఓ మంత్రి భయపెట్టారని ఒకరు, అధికార పార్టీకి చెందిన నేత ఒకరు తనను చంపేస్తానన్నారని మరొకరు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జిగా చక్రం తిప్పుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తమను బెదిరించారని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు ఉంటున్నాయి.

విశాఖపట్నం అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాలు, వాటితో ముడిపడి ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఈ వేధింపులు కొత్తమీ కాదు. గతం(2021 సెప్టెంబరు)లో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కొమ్మాదిలో 12 ఎకరాల భూమి కొనుగోలు విషయంలో నాటి విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ని, మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ని ఇబ్బందిపెట్టారు. ఎకరా రూ.8 కోట్లు చొప్పున రూ.100 కోట్ల విలువ చేసే భూమి రూ.18 కోట్లకే వస్తున్నదని దళారి చెప్పడంతో ఎమ్మెల్యే అడ్వాన్స్‌ ఇచ్చేశారు. ఆ భూమి యజయాని అమెరికాలో ఉండగా వారికి తెలియకుండా ఎమ్మెల్యే కుమారుడి పేరిట రిజిస్టర్‌ చేయడానికి యత్నించారు. అక్కడ ఎకరా భూమి ప్రభుత్వ ధర ఆనాడు రూ.2.2 కోట్లు ఉండగా దానిని రూ.1.53 కోట్లు చొప్పున రిజిస్టర్‌ చేయాలని, ఆ మొత్తానికే ఫీజులు కట్టించుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి పెట్టారు. అలాగే ఆ భూమి పత్రాల కోసం తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బందిని బెదిరించారు. ఈ కేసులో ఎమ్మెల్యే కూడా మోసపోయారు. అయితే తనకు అనుకూలంగా చేయాల్సిందిగా అధికారులను బెదిరించారు.

నేను వచ్చానంటే అర్థం చేసుకోవాలి

నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇప్పుడు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. భీమిలి, భోగాపురం, ఆనందపురం ఇలా చాటాచోట్ల ఆయన వెంచర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ విషయంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. అది ప్రభుత్వ భూమి అని, సర్వే నంబరు సబ్‌ డివిజన్‌ జరిగిందని, ఆ వివరాలు తీసుకువస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని సదరు అధికారి వివరించారు. దానికి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను వచ్చానంటే అర్థం చేసుకోవాలి. పని చేసి పెట్టాలి’ అంటూ రంకెలు వేశారు. అక్కడితో ఆగకుండా డబ్బులు ఇస్తే చేసేస్తావా? నీ సంగతి తేలుస్తా!!’ అంటూ హెచ్చరించారు.

చెట్టుకు వేలాడ దీస్తా

పక్క జిల్లాలో సీనియర్‌ మంత్రి ఉన్నా అధికారులంతా అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడు చెప్పినట్టు వినాల్సిందే. ఆ జిల్లాకు, విశాఖ జిల్లాకు సరిహద్దుల్లోని భూముల లావాదేవీల విషయంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనల ప్రకారం చేయలేమని చెప్పడంతో తీవ్రస్థాయిలో బెదిరించారు. ‘పిచ్చి వేషాలు వేస్తే...చెట్టుకు వేలాడ దీస్తా’ అంటూ హెచ్చరించారు.

భీమిలి, గాజువాక, ఆనందపురం మండలాలతో పాటు అక్కడి సబ్‌ రిజిస్ట్రార్లకు కూడా ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. కొందరు అక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోతే, మరికొందరు ఆ కార్యాలయాలకు వెళ్లడానికి నిరాకరించి వేరే ప్రాంతాల్లో పోస్టింగులు వేయించుకున్నారు. ఏదేమైనా విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వల్ల బెదిరింపులు అధికం అయ్యాయనేది కాదనలేని వాస్తవం.

ఆరోగ్యం బాగాలేదు...

అప్రాధాన్య పోస్టు ఇవ్వండి

రూరల్‌ తహసీల్దారుగా బాధ్యతలు తీసుకోని శ్రీనివాస మిశ్రా

విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):

విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన శ్రీనివాస మిశ్రా విశాఖ రూరల్‌ తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించలేదు. తనకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నందున అప్రాధాన్య మండలానికి పంపాలని, లేకపోతే కలెక్టరేట్‌లో సెక్షన్‌ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీసీఎల్‌ఏ ఆదేశాలు, కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు రూరల్‌ తహసీల్దారుగా సోమవారంలోగా బాధ్యతలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. అయినప్పటికీ ఆయన ముందుకురాలేదు. రూరల్‌ తహసీల్దారుగా పనిచేసి గత నెల 31న విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి బదిలీ అయిన సనపల రమణయ్య ఈనెల రెండో తేదీ రాత్రి కొమ్మాదిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. రూరల్‌ మండలంలో అనేక భూములు వివాదాల్లో ఉన్నాయి. నిత్యం కోర్టు కేసులకు హాజరుకావాల్సి ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో అనేకమంది రాజకీయ ప్రముఖులకు ఈ మండలంలో భూములు ఉండడంతో అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందనే శ్రీనివాస మిశ్రా రూరల్‌ తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేసి ఉంటారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

Updated Date - Feb 06 , 2024 | 01:21 AM