Share News

భక్తులతో కిటకిటలాడిన నూకాంబిక ఆలయం

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:32 AM

స్థానిక నూకాంబిక అమ్మవారి బాలాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

భక్తులతో కిటకిటలాడిన నూకాంబిక ఆలయం
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2 : స్థానిక నూకాంబిక అమ్మవారి బాలాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి కొత్తఅమావాస్య జాతర ముగిసి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఆలయానికి భక్తుల తాకిడి తగ్గలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి క్యూలైన్లు రద్దీగా మారడంతో భక్తులకు ఆలయ సిబ్బంది తాగునీటిని సరఫరా చేశారు. ఆలయ ఆవరణతో పాటు పరిసర తోటల్లో భక్తులు వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలు దాటినా ఆలయ ఆవరణలో భక్తుల తాకిడి తగ్గలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. ఆలయానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jun 03 , 2024 | 12:32 AM