Share News

పోలీసులకు ‘నార్త్‌’ రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:51 AM

ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల నిబంధనలను అతిక్రమించడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

పోలీసులకు ‘నార్త్‌’ రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌

కేకే రాజు నామినేషన్‌ దాఖలు సమయంలో గందరగోళం

నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందికి అనుమతి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల నిబంధనలను అతిక్రమించడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులకు తాజాగా రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌ జారీచేశారు. వివరాలిలా ఉన్నాయి. ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి స్వీకరిస్తారు. ఈ సందర్భంగా కార్యాలయంలోకి అభ్యర్థితోపాటు మొత్తం ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థితోపాటు మొత్తం ఐదుగురిని లోపలకు పంపే బాధ్యత పోలీసులదే. అయితే ఈ నెల 19వ తేదీన (శనివారం) కేకే రాజుతోపాటు మొత్తం ఏడుగురు రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రిటర్నింగ్‌ అధికారి నామినేషన్లు స్వీకరించే కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకే ర్యాలీలు, ఊరేగింపులు అనుమతిస్తారు. అయితే కేకే రాజుతోపాటు ఆయన మద్దతుదారులు, వైసీపీ నేతలు పెద్దఎత్తున కార్యాలయంలోకి ప్రవేశించారు. దీంతో గందరగోళం ఏర్పడింది. కేకే రాజుతోపాటు ఆయన సతీమణి ఇద్దరూ నామినేషన్‌ వేయాల్సి ఉండడంతో రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లోకి వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నా, ఒకరు నామినేషన్‌ వేసిన తరువాత మరొకరు ఛాంబర్‌లోకి వెళ్లాలి. ఈ వ్యవహారంలో పోలీసుల పనితీరుపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీతమ్మధార తహసీల్దారు కార్యాలయం ఎదుట విధులు నిర్వహించిన పోలీసులకు రిటర్నింగ్‌ అధికారి అఖిల షోకాజ్‌ జారీచేశారు. కేకే రాజుపై ద్వారకా పోలీసులకు ఆమె ఇప్పటికే ఫిర్యాదుచేశారు. ఇదిలావుండగా నామినేషన్‌ దాఖలు సమయంలో కేకే రాజు, ఆయన మద్దతుదారులు వ్యవహారం, వారికి సహకరించిన అధికారులు, పోలీసులపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 22 , 2024 | 01:51 AM