Share News

కాంగ్రెసేతర పార్టీలకు మాడుగుల పట్టం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:46 AM

జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో మాడుగుల ఒకటి. సుదీర్ఘ కాలం ఈ ప్రాంతం ఒరియా రాజుల పాలనలో ఉండేది.

కాంగ్రెసేతర పార్టీలకు మాడుగుల పట్టం

  • 1952లో నియోజకవర్గం ఆవిర్భావం

  • ఇప్పటివరకూ 15సార్లు ఎన్నికలు

  • ఆరుసార్లు టీడీపీ అభ్యర్థుల గెలుపు

  • రెడ్డి సత్యనారాయణ రికార్డు...వరుసగా ఐదుసార్లు ఎన్నిక

  • మూడుసార్లు కాంగ్రెస్‌, వైసీపీ రెండుసార్లు విజయం

  • 1955లో ప్రజా పార్టీ తరపున ఓడి, 1962లో ఇండిపెండెంట్‌గా గెలిచిన తెన్నేటి విశ్వనాథం

  • నియోజకవర్గంలోని మండలాలు

  • 1. మాడుగుల, 2. దేవరాపల్లి, 3. కె.కోటపాడు, 4. చీడికాడ

  • మొత్తం ఓటర్లు 1,87,223

  • మహిళలు 91,291

  • పురుషులు 95,921

  • ఇతరులు 11

మాడుగుల, ఏప్రిల్‌ 20:

జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో మాడుగుల ఒకటి. సుదీర్ఘ కాలం ఈ ప్రాంతం ఒరియా రాజుల పాలనలో ఉండేది. ఏజెన్సీకి ముఖద్వారంగా అలరారే ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఆది నుంచి భిన్నంగా ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చాలాకాలం పాటు ప్రజలు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం పదిహేనుసార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి చెప్పుకోవాలంటే ఒక విశేషం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఆ పార్టీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యానారాయణ వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన ఏకైక నాయకుడు రెడ్డి సత్యనారాయణ. ఆయన రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు.

నియోజకవర్గ చరిత్ర...

మాడుగుల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటినుంచి 2019 వరకు పదిహేనుసార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో కృషీకార్‌ లోక్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బోజంగి గంగయ్యనాయుడు...కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలకుర్తి సత్యనారాయణపై 3,221 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1955లో ప్రజా సోషలిస్ట్‌ పార్టీకి చెందిన దొండా శ్రీరామ్మూర్తి...ప్రజాపార్టీకి చెందిన తెన్నేటి విశ్వనాథంపై 4,869 ఓట్ల మెజారిటీతో, 1962లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథం...కాంగ్రెస్‌ అభ్యర్థి దొండా శ్రీరామ్మూర్తిపై 18,585 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 1967లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన మహరాణి రమాకుమారిదేవి...ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎస్‌.భూమిరెడ్డి సత్యనారాయణపై 20,257 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమాకుమారిదేవి పోటీ చెయ్యకపోవడంతో ఆమె స్థానంలో బొడ్డు కళావతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఇండిపెండింట్‌ అభ్యర్థి ఎస్‌.భూమిరెడ్డి సత్యనారాయణపై 6,344 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1978లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కురచా రామునాయుడు, ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థి గుమ్మాల ఆదినారాయణపై 437 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 1983లో టీడీపీ నుంచి తొలిసారి బరిలోకి దిగిన రెడ్డి సత్యనారాయణ...కాంగ్రెస్‌ అభ్యర్థి వారాడ (బొడ్డు) సూర్యనారాయణమూర్తిపై 16,882 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కురచా రామునాయుడుపై 28,421 ఓట్ల తేడాతో రెండో పర్యాయం కూడా రెడ్డి సత్యనారాయణ గెలిచారు. అలాగే 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి కురచా రామునాయుడుపై 10,084 ఓట్లతో, 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిలపర్తి సూరిఅప్పారావుపై 27,091 ఓట్ల ఆధిక్యంతో, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొండా కన్నబాబుపై 5,831 ఓట్ల ఆధిక్యంతో రెడ్డి సత్యనారాయణ గెలుపొందారు. రెడ్డి సత్యనారాయణ నందమూరి తారకరామారావు మంత్రివర్గంలో పశు సంవర్ధకశాఖ శాఖా మంత్రిగా, శాసన ఉపనాయకుడిగా పనిచేశారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ 8,737 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 కాంగ్రెస్‌ అభ్యర్థి అవుగెడ్డ రామ్మూర్తినాయుడుపై టీడీపీ నుంచి పోటీకి దిగిన గవిరెడ్డి రామానాయుడు 6,827 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఇక 2014, 2019లో టీడీపీ అభ్యర్థి రామానాయుడుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు వరుసగా 4,761, 16,396 ఓట్ల మెజారిటీతో విజయం సాఽదించారు. వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బండారు సత్యనారాయణమూర్తి, వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ పోటీలో ఉన్నారు. ఇంకా ఇతర పార్టీల తరపున, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా...ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే జరగనున్నది.

సంవత్సరం విజేత పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ

1. 1952 బోజంకి గంగయ్యనాయుడు కేఎల్‌పి 10,525 ఇ.సత్యనారాయణ కాంగ్రెస్‌ 7,304 3,221

2. 1955 దొండా శ్రీరామ్మూర్తి పిఎస్‌ఎల్‌పి 18,862 తెన్నేటి విశ్వనాథం ప్రజాపార్టీ 13,993 4,869

3. 1962 తెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్‌ 26,478 దొండా శ్రీరామ్మూర్తి కాంగ్రెస్‌ 7,893 18,585

4. 1967 రాణి రమణకుమారీదేవి కాంగ్రెస్‌ 34,561 ఎస్‌.బి.సత్యనారాయణ ఇండి 14,304 20,257

5. 1972 బొడ్డు కళావతి కాంగ్రెస్‌ 26,764 ఎస్‌.బి సత్యన్నారాయణ ఇండి 20,420 6,344

6. 1978 కురచా రామునాయుడు ఇండిపెండెంట్‌ 19,147 గుమ్మాల ఆదినారాయణ కాంగ్రెస్‌ 18,710 437

7. 1983 రెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం 35,439 బొడ్డు సూర్యనారాయణ కాంగ్రెస్‌ 18,557 16,882

8. 1985 రెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం 46,104 కురచా రామునాయుడు కాంగ్రెస్‌ 17,683 28,421

9. 1989 రెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం 48,872 కురచా రామునాయుడు కాంగ్రెస్‌ 38,788 10,084

10. 1994 రెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం 51,230 కిలపర్తి సూరిఅప్పారావు కాంగ్రెస్‌ 24,139 27,091

11. 1999 రెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం 53,407 దొండా కన్నబాబు కాంగ్రెస్‌ 47,576 5,831

12. 2004 కరణం ధర్మశ్రీ కాంగ్రెస్‌ 50,361 రెడ్డి సత్యన్నారాయణ తెలుగుదేశం 41,624 8,737

13. 2009 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం 52,762 అవుగెడ్డ రామ్మూర్తినాయుడు కాంగ్రెస్‌ 45,935 6,827

14. 2014 బూడి ముత్యాలనాయుడు వైసీపీ 72,299 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం 67,538 4,761

15. 2019 బూడి ముత్యాలనాయుడు వైసీపీ 78,830 గవిరెడ్డి రామానాయుడు తెలుగుదేశం 62,438 16,396

Updated Date - Apr 25 , 2024 | 01:46 AM