Share News

ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:04 AM

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది.

ముగిసిన నామినేషన్ల ఘట్టం

విశాఖ లోక్‌సభ నియోజకవర్గ బరిలో 33 మంది అభ్యర్థులు

తెలుగుదేశం నుంచి ఎం.శ్రీభరత్‌

వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మీ

కాంగ్రెస్‌ నుంచి పి.సత్యనారాయణరెడ్డి

ఏడు అసెంబ్లీ స్థానాలకు బరిలో 101 మంది

‘భీమిలి’లో 15 మంది, ‘తూర్పు’లో 14 మంది, ‘సౌత్‌’లో 16 మంది, ‘నార్త్‌’లో 15 మంది, ‘పశ్చిమ’లో 13 మంది, గాజువాకలో 15 మంది, పెందుర్తిలో 14 మంది పోటీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. ఉపసంహరణకు తుదిగడువు అనంతరం విశాఖ లోక్‌సభ స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రకటించారు. విశాఖ లోక్‌సభ స్థానం చరిత్రలో ఇంతమంది బరిలో ఉండడం ఇదే తొలిసారి. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చివరిరోజు 18 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 101 మంది పోటీలో మిగిలారు.

విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో నలుగురు ప్రధాన పార్టీలకు చెందినవారు కాగా మరో 14 మంది రిజిస్టర్డ్‌ పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీ తరఫున మతుకుమల్లి శ్రీభరత్‌ (గీతం యూనివర్సిటీ అధ్యక్షులు), వైసీపీ నుంచి బొత్స ఝాన్సీలక్ష్మీ (మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి), కాంగ్రెస్‌ పార్టీ నుంచి పి.సత్యనారాయణరెడ్డి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరఫున పెదపెంకి శివప్రసాదరావు ఉన్నారు.

రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులు

రిజిస్టర్డ్‌ పార్టీల నుంచి 14 మంది అభ్యర్థులు ఉన్నారు. అంధుకూరి విజయ భాస్కర్‌ (ఇండియా ప్రజా బంధు పార్టీ), మురపాల అచ్యుతకిరణ్‌ బాలాజీ (భారత చైతన్య యువజన పార్టీ), డాక్టర్‌ కొంగరపు గణపతి (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), కిలారి ఆనంద్‌ (ప్రజాశాంతి పార్టీ), గుంటు దుర్గాప్రసాద్‌ (భారతీయ రాష్ట్రీయ దళ్‌), గణపతి జగదీశ్వరరావు (జై మహా భారత్‌), గండికోట రాజేశ్‌ (నవతరం), చింతాడ సూర్యం (నవ భారత నిర్మాణ సేవా పార్టీ), జాలాది విజయకుమారి (సమాజ్‌వాదీ), తోట వెంకటసాయి ముకుంద్‌ (ప్రజా ప్రస్థానం పార్టీ), బన్నా రమేశ్‌(దళిత బహుజన పార్టీ), బిక్కవోలు చలమాజీ (నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), వాండ్రాసి నాగ సత్యనారాయణ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌), పి.సత్యవతి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) బరిలో మిగిలారు.

స్వతంత్రులు

ప్రధాన, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు కాకుండా మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. వీరిలో మురల అరుణశ్రీ, జీఏఎన్‌ ఆనంద్‌, కొల్లి నాగరాజు, మొహ్మద్‌ గౌస్‌ మొహిద్దీన్‌ ఖాన్‌, చప్పిడి రాము, పొన్నాడ జనార్దన్‌, పీడిది అప్పారావు, మళ్ల శ్రావణి, మెట్ట రామారావు, లగుడు గోవిందరావు, వడ్డి హరి గణేశ్‌, కర్రి వేణు మాధవ్‌, దేవర శంకర్‌, వాసుపల్లి సురేశ్‌, సొండి కృష్ణ ఉన్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా...

భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోగా 15 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ గంటా శ్రీనివాసరావు (టీడీపీ), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (వైసీపీ) మధ్య జరగనున్నది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒకరు నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో 14 మంది బరిలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు, వైసీపీ తరపున ఎంవీవీ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుంచి గుత్తల శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో సోమవారం ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు 16 మంది మిగిలారు. ఇక్కడ జనసేన నుంచి సీహెచ్‌ వంశీకృష్ణశ్రీనివాస్‌, వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అభ్యర్థులుగా ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చివరిరోజు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోగా బరిలో 15 మంది ఉన్నారు. బీజేపీ నుంచి పి.విష్ణుకుమార్‌రాజు, వైసీపీ తరపున కేకే రాజు, జైభారత్‌ పార్టీ నుంచి వీవీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ నుంచి లక్కరాజు రామారావు బరిలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 13 మంది పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పి.గణబాబు, వైసీపీ తరపున ఆడారి ఆనందకుమార్‌, సీపీఐ తరపున ఎ.విమల పోటీ చేస్తున్నారు. గాజువాకలో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పోటీలో 15 మంది మిగిలారు. పల్లా శ్రీనివాసరావు (తెలుగుదేశం), గుడివాడ అమర్‌నాథ్‌ (వైసీపీ), సీపీఎం నుంచి మరడాన జగ్గునాయుడు అభ్యర్థులుగా ఉన్నారు. పెందుర్తిలో సోమవారం నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 14 మంది పోటీలో ఉన్నారు. జనసేన తరపున పంచకర్ల రమేష్‌కుమార్‌, వైసీపీ తరపున అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పిరిడి భగత్‌ బరిలో ఉన్నారు.

లోక్‌సభ స్థానానికి ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే...

అభ్యర్థులు ఇరవురూ రాజకీయ నేపథ్యం కలిగినవారే

విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీలో ఎంతమంది ఉన్నా ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ జరగనుంది. వీరిలో ఒకరు కూటమి తరపున పోటీ చేస్తున్న మతుకుమిల్లి శ్రీభరత్‌ (టీడీపీ) కాగా మరొకరు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. వీరిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది. ఝాన్సీ లక్ష్మి ఒకసారి బొబ్బిలి నుంచి మరోసారి విజయనగరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆమె విద్యావంతురాలు. రెండు పీహెచ్‌డీలు చేశారు. ఆమె భర్త సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ.

మతుకుమల్లి శ్రీభరత్‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తాత ఎంవీవీఎస్‌ మూర్తి గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు. రెండుసార్లు విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మూర్తి 2108లో అమెరికాలో ఊహించని విధంగా జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. దాంతో మనుమడైన శ్రీభరత్‌ వారసుడిగా తెరపైకి వచ్చారు. గీతం అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన యూఎస్‌లో పర్ద్యూ యూనివర్సిటీలో ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌, స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చేశారు. ప్రపంచంలో విద్యా రంగంపై అమితమైన అవగాహన ఉంది. భారతీయ విద్యా వ్యవస్థలోను, ముఖ్యంగా ఏపీలో చాలా మార్పులు చేయాలనేది ఆయన ప్రగాఢ కోరిక. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేశారు. మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున, బీజేపీ తరఫున మాజీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆ ఎన్నికల్లో నిలబడడంతో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య చతుర్ముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓట్లు బాగా చీలడం వైసీపీకి లాభించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4,414 ఓట్ల స్పల్ప మెజారిటీతో శ్రీభరత్‌పై గెలుపొందారు. శ్రీభరత్‌ మరో తాత (తల్లి తండ్రి) కావూరి సాంబశివరావు. ఆయన సీనియర్‌ రాజకీయ నాయకుడు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరపున మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున సత్యనారాయణరెడ్డి, ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్‌ పోటీ చేస్తున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 02:04 AM