Share News

నామినేషన్లు బోణి

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:19 AM

ఏజెన్సీలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు రెండో రోజు శుక్రవారం నామినేషన్లు బోణి అయ్యాయి. పాడేరు అసెంబ్లీ స్థానానికి ఇద్దరు, అరకులోయకు ఐదుగురు నామినేషన్లు వేశారు. పాడేరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ, బీఎస్‌పీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మరో ముగ్గురు నామినేషన్లను సమర్పించారు.

నామినేషన్లు బోణి
ఆర్‌వో వి.అభిషేక్‌కు నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న అరకులోయ బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు

- పాడేరు అసెంబ్లీ స్థానానికి 2, అరకులోయకు 5 దాఖలు

పాడేరు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు రెండో రోజు శుక్రవారం నామినేషన్లు బోణి అయ్యాయి. పాడేరు అసెంబ్లీ స్థానానికి ఇద్దరు, అరకులోయకు ఐదుగురు నామినేషన్లు వేశారు. పాడేరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ, బీఎస్‌పీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మరో ముగ్గురు నామినేషన్లను సమర్పించారు.

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి కిల్లు వెంకటరమేశ్‌నాయుడు... జనసేన నేత వంపూరు గంగులయ్య, పార్టీ పరిశీలకుడు మురళితో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే వైసీపీ అభ్యర్థి మత్స్సరాస విశ్వేశ్వరరాజు.. ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రలతో కలిసి తన నామినేషన్‌ను ఆర్వో భావన వశిష్ఠకు సమర్పించారు. ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు వేయడం విశేషం.

అరకులోయకు ఐదు నామినేషన్లు

అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు... బీజేపీ, టీడీపీ నేతలతో కలిసి ఆర్వో వి.అభిషేక్‌కు తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అలాగే బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి లకే రాజారావు, సివేరి అబ్రహం, సమర్థి రఘునాథ్‌, సమర్థి గులాబీ స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లను ఆర్వోకు సమర్పించారు.

పాడేరులో పటిష్ఠ బందోబస్తు

పాడేరులోనే పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ కార్యాలయాలు ఉండడంతో పాటు శుక్రవారం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండడంతో పోలీసులు పట్టణంలోని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ పత్రాలను సమర్పించేందుకు వచ్చే అభ్యర్థుల ఊరేగింపులు, ర్యాలీలను రిటర్నింగ్‌ కార్యాలయానికి 200 మీటర్ల ముందునే నిలిపివేశారు. రెండు ఆర్వో కార్యాలయాల ముందుపోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం టీడీపీ, వైసీపీ, బీజేపీ, బీఎస్‌పీ, స్వతంత్రులు సైతం నామినేషన్‌లు వేయడంతో శుక్రవారం పాడేరులో సందడి నెలకొంది. ఈ క్రమంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Apr 20 , 2024 | 01:19 AM