నీళ్లూ లేవు.. కరెంట్ లేదు..
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:04 AM
రాత్రంతా విద్యుత్ లేదు.. ఉదయం కొళాయిల నుంచి నీరు రాలేదంటూ పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలమంచిలి, జూన్ 3: రాత్రంతా విద్యుత్ లేదు.. ఉదయం కొళాయిల నుంచి నీరు రాలేదంటూ పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలమంచిలిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదపల్లి సమీపంలో వ్యవసాయ రైతు పడుకునే షెడ్డుపై రాత్రి ఈదురు గాలులకు ట్రాన్స్‌ఫారం ఉన్న విద్యుత్ స్తంభం పడింది. ఇదే షెడ్డులో రైతు రోజూ పడుకునే వాడని ఆదివారం రాత్రి పడుకోకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నర్సింగబల్లి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఎలమంచిలి వచ్చే 33 కేవీ లైన్‌పై పలుచోట్ల చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు ఈపీడీసీఎల్ అధికారులు అంటున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఈ ప్రభావం తాగునీటి పఽథకాలపై పడింది. దీంతో పట్టణంలో తాగునీటి కొళాయిలు రాకపోవడంతో నీటి కోసం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో ఇటీవల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కొత్తపేట, మిలట్రీ కాలనీ వాసులు చెబుతున్నారు.