Share News

ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - May 06 , 2024 | 01:15 AM

అరకులోయలో అభివృద్ధి నిలిచిపోయింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పర్యాటక ప్రాజెక్టులు పడకేశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి.

ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న ఈట్‌ స్ట్రీట్‌ అసంపూర్తి నిర్మాణం

- పర్యాటక ప్రాజెక్టులను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

- టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కూడా ముందుకు సాగని వైనం

- స్థానిక గిరిజనులకు దక్కని ఉపాధి అవకాశాలు

అరకులోయ, మే 5: అరకులోయలో అభివృద్ధి నిలిచిపోయింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పర్యాటక ప్రాజెక్టులు పడకేశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయి.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈట్‌ స్ట్రీట్‌, ట్రైబల్‌ హట్‌ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అరకులోయకు మూడు కిలోమీటర్ల దూరాన కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ సెంటర్‌కు చెందిన ఫాంలో ఐటీడీఏ ప్రత్యేకంగా 18 ఎకరాల స్థలాన్ని పర్యాటక సంస్థకు అప్పగించింది. ఈట్‌ స్ట్రీట్‌లో పర్యాటకులు ఇష్టపడే వంటకాలను అందుబాటులో ఉంచాలని, దీని వల్ల స్థానిక గిరిజనులకు కూడా ఉపాధి దొరుకుతుందని భావించింది. దీని నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు ప్రారంభమయ్యాయి. పనులు జోరుగా సాగుతున్న సమయంలో ఎన్నికలు జరిగి, వైసీపీ అధికారంలోకి రావడంతో పనులకు బ్రేక్‌ పడింది. కాంట్రాక్టరుకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. ప్రస్తుతం అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న ఆ ప్రాంతం తుప్పలు, పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉంది.

పట్టాలెక్కని కార్వాన్‌ టూరిజం

పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్వాన్‌ టూరిజాన్ని ప్రోత్సహించాలని భావించి పర్యాటక శాఖ ఎండీ, అధికారులు పలు సుందర ప్రదేశాలను ఎంపిక చేశారు. ఏడాది క్రితం సర్వే కూడా చేశారు. అలాగే బొర్రా గుహలు రెండో గుహల ప్రదేశం నుంచి టర్కీ తరహా కేవ్‌ రెస్టారెంట్‌, రిసార్టులు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.

అందుబాటులోకి రాని డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌

అరకులోయ హరిత వేలీ రిసార్టు ప్రాంగణంలో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను నాలుగేళ్ల క్రితం అప్పటి పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను హరిత రిసార్ట్స్‌, పర్యాటక సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. దీంతో పర్యాటక సంస్థ అధికారులు వెనక్కి తగ్గారు. పర్యాటక సంస్థే దీనిని నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో అప్పటి నుంచి అది పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా ఉంది. కాగా గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు నోచుకోక రైతులు, రహదారులు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Updated Date - May 06 , 2024 | 01:15 AM