Share News

చడీచప్పుడు లేదు

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:21 AM

వార్డు సచివాలయాల్లో సిబ్బంది పెద్దగా కానరావడం లేదు.

చడీచప్పుడు లేదు

జీవీఎంసీ పరిధిలో వార్డు సచివాలయాలు 578

ప్రతి సచివాలయంలో ఉండాల్సిన సిబ్బంది 9

మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,202

ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,387

మొత్తం ఖాళీలు 815

-----------------------

స్తబ్దుగా సచివాలయాలు

సమయపాలన పాటించని కొందరు సిబ్బంది

ఉదయం 10.30 గంటలకు వచ్చేది ఒకరిద్దరే

మిగిలిన వారంతా ఫీల్డ్‌వర్క్‌ పేరుతో కార్యాలయానికి దూరం

ఏదో సమయంలో మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్న వైనం

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యం

పనుల కోసం సచివాలయాలకు వచ్చేవారి సంఖ్యా తక్కువే

ఆంధ్రజ్యోతి విజిట్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వార్డు సచివాలయాల్లో సిబ్బంది పెద్దగా కానరావడం లేదు. ఉదయం 11 గంటలకు కూడా కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కొంతమంది రాజీనామా చేసి వెళ్లిపోగా...ఉన్నవారిలో కూడా కొందరు సమయపాలన పాటించడం లేదు. ఒక్కో సచివాలయంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండాలి. అయితే గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు పలు సచివాలయాలను పరిశీలించినప్పుడు ఇద్దరు, ముగ్గురు మాత్రమే కనిపించారు.

గత వైసీపీ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జీవీఎంసీ పరిధిలో ప్రతి రెండు వేల ఇళ్లకు ఒకటి చొప్పున 578 సచివాలయాలను ఏర్పాటుచేసింది. ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ నుంచి రేషన్‌ కార్డులు, సామాజిక పింఛన్లు, పక్కా ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం జీవీఎంసీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేకుండా వార్డు సచివాలయానికి వెళ్లి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి వార్డు సచివాలయంలో తొమ్మిది మంది ఉద్యోగులు...అడ్మినిస్ర్టేషన్‌ సెక్రటరీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, ఎమినిటీస్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీ (ఏఎన్‌ఎం), రెవెన్యూ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సెక్రటరీలను నియమించింది. ఇలా జీవీఎంసీ పరిధిలోని 578 వార్డు సచివాలయాల్లో 5,022 మంది నియమితులయ్యారు. మొదట్లో పూర్తిస్థాయి సిబ్బందితో సచివాలయాలు కళకళలాడుతుండేవి. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకూ సిబ్బంది సచివాలయంలోనే ఉండేవారు. కానీ తర్వాత సచివాలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో కొంతమంది ఉద్యోగుల్లో నిర్లక్ష్యం పెరిగింది. ఉదయం పది గంటలకు కార్యాలయానికి రావాల్సి ఉన్నప్పటికీ తీరికగా ఏదో సమయంలో కార్యాలయానికి వచ్చి,పోతున్నారు. సంబంధిత కార్యదర్శితో పని ఉండి ఎవరైనా వస్తే...ఫీల్డ్‌కు వెళ్లారనో, కోర్టు కేసు పనిమీద బయటకు వెళ్లారని కార్యాలయంలో ఉన్నవారు సమాధానం చెప్పి పంపించేస్తున్నారు.

కానరాని సమయపాలన

వార్డు సచివాలయ ఉద్యోగులంతా విధిగా ఉదయం పది గంటలకు కార్యాలయానికి చేరుకోవాలి. తర్వాత తాము ఫీల్డ్‌వర్కుకి వెళ్లినా, కోర్టు కేసుల పనిమీద బయటకు వెళ్లినా, జోనల్‌ కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదుచేయాలి. అలాంటి పనులేవీ లేకపోతే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే కొందరు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఉదయం 11 గంటలైనాసరే కార్యాలయం తలుపులు తెరుచుకోవడం లేదంటున్నారు. మరికొన్నిచోట్ల మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఉదయం పది గంటలకు కార్యాలయానికి చేరుకుంటున్నారు. మిగిలిన వారంతా ఏదో సమయంలో కార్యాలయానికి వస్తున్నారు.

- మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని 149 నంబర్‌ సచివాలయానికి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు గురువారం ఉదయం 10.30 గంటలకు వెళ్లేసరికి కేవలం ఒక హెల్త్‌ సెక్రటరీ మాత్రమే ఉన్నారు. అడ్మిన్‌ సెక్రటరీ వచ్చి సిబ్బంది హాజరు వివరాలను జీవీఎంసీ మెయిన్‌ ఆఫీస్‌కు తీసుకువెళ్లినట్టు వారు తెలిపారు. అక్కడ తొమ్మిది సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ ఐదుగురు వివిధ కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయడంతో కేవలం నలుగురే మిగిలారు.

శివాజీపాలెం 152 నంబర్‌ సచివాలయానికి 10.40 గంటలకు వెళ్లేసరికి మహిళా పోలీస్‌, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరీ సెక్రటరీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ఎంట్రీ సెక్రటరీ ఉన్నారు. అక్కడ తొమ్మిది మంది ఉద్యోగులు ఉండాల్సి ఉన్నప్పటికీ నలుగురు రాజీనామా చేయడంతో ఐదుగురు మాత్రమే మిగిలారు. అక్కడ పనుల కోసం వచ్చినవారు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.

శివాజీపాలెం 151 నంబర్‌ సచివాలయానికి 10.50 గంటలకు వెళ్లేసరికి అడ్మిన్‌ సెక్రటరీతోపాటు ఎమినిటీస్‌ అండ్‌ శానిటేషన్‌ సెక్రటరీ మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలినవారంతా వివిధ పనుల మీద ఫీల్డ్‌కు వెళ్లారని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ కోసం వచ్చిన ఇద్దరు మాత్రమే సచివాలయంలో ఉన్నారు.

బాలాజీనగర్‌ 147 నంబర్‌ సచివాలయానికి ఉదయం 11 గంటలకు వెళ్లేసరికి నలుగురు సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ సమయంలో పనుల కోసం సచివాలయానికి వచ్చినవారు ఒక్కరు కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

శివాజీపాలెం 150 సచివాలయానికి ఉదయం 11.10 గంటలకు వెళ్లేసరికి ముగ్గురు సిబ్బంది సచివాలయంలో ఉన్నారు. పనుల కోసం సచివాలయానికి వచ్చినవారు అక్కడ కూడా ఒక్కరూ లేకపోవడం విశేషం.

సచివాలయాల్లో చేరిన వారిలో కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలను విడిచిపెట్టేయడంతో ఖాళీలు పెరిగిపోయాయి. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 815 వార్డు సచివాలయ కార్యదర్శులు పోస్టులు ఖాళీగా ఉండడంతో పక్క సచివాలయాల్లోని సిబ్బందికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:21 AM