Share News

ఏటీఎంలకు భద్రత నిల్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:07 AM

నగరంలో కొన్నిచోట్ల మినహాయిస్తే ఏటీఎంలకు ఎక్కడా సరైన భద్రత ఉండడం లేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు వరంగా మారింది. నగరంలో వరుస చోరీల నేపథ్యంలో ఏటీఎంల భద్రతపై చర్చ మొదలైంది.

ఏటీఎంలకు భద్రత నిల్‌
కప్పరాడలో సెక్యూరిటీ గార్డులేని ఏటీఎం కేంద్రం

నిర్వహణ భారం పేరుతో సెక్యూరిటీ గార్డులను తొలగించిన బ్యాంకులు

సీసీ కెమెరాల నిర్వహణపైనా నిర్లక్ష్యం

నగదు నింపే ఏజెన్సీలపైనా పర్యవేక్షణ కరవు

దొంగలకు వరంగా మారిన బ్యాంకర్ల తీరు

ఏటీఎంలలో భద్రత పెంపుపై దృష్టిసారించిన సీపీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కొన్నిచోట్ల మినహాయిస్తే ఏటీఎంలకు ఎక్కడా సరైన భద్రత ఉండడం లేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దొంగలకు వరంగా మారింది. నగరంలో వరుస చోరీల నేపథ్యంలో ఏటీఎంల భద్రతపై చర్చ మొదలైంది.

నగర పరిధిలో 500కిపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఎక్కడికక్కడ ఏటీఎం కేంద్రాలను ఏర్పాటుచేశాయి. మొదట్లో ఏటీఎంల వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాయి. దాంతోపాటు ఏటీఎం కార్డుని స్వైప్‌ చేస్తేగానీ డోర్‌ తెరుచుకోనివిధంగా కొన్నిచోట్ల భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఏటీఎం లోపల ఎవరైనా అమాయకులను మోసం చేసి డబ్బులు కొల్లగొట్టినా, దోపిడీ చేసినా నిందితులను సులభంగా గుర్తించే అవకాశం ఉండేది. కాలక్రమేణా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు డిమాండ్‌ తగ్గింది. అదే సమయంలో బ్యాంకులు కూడా నిర్వహణ భారాన్ని తగ్గించుకునే చర్యలపై దృష్టిసారించాయి. ముఖ్యమైన ఏటీఎంలు, బ్యాంకు ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ-కార్నర్‌ వంటి చోట్ల మినహాయిస్తే మిగిలిన కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తొలగించాయి. అదేవిధంగా ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాలు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో వాటిని పట్టించుకోకుండా వదిలేశాయి. ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో సీసీ కెమెరాల ఫుటేజీని పర్యవేక్షించే కంట్రోల్‌ రూమ్‌లపైనా నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఏటీఎంల భద్రత గాల్లో దీపం మాదిరిగా మారిపోయింది. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో ఏటీఎం కేంద్రాలు నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎంలను తెరవడం చాలా క్లిష్టమైన పని. ఏదో పదునైన ఆయుధం ఉపయోగించి తెరిచినప్పటికీ, అందులో నగదు ఉంచిన కంటైనర్‌ను తెరవడం అసాధ్యం. దీంతో దొంగలు తెలివిగా గ్యాస్‌ కట్టర్‌ను ఉపయోగించి నగదు ఉండే కంటెయినర్‌ను కూడా క్షణాల్లో తెరిచేస్తున్నారు. ఏటీఎంలలోని సీసీ కెమెరాలను బ్యాంక్‌ల కంట్రోల్‌రూమ్‌కు గతంలో మాదిరిగా అనుసంధానించకపోవడం, అనుసంధానం కొన్నిచోట్ల ఉన్నప్పటికీ పర్యవేక్షించే సిబ్బంది లేకపోవడం వల్ల నేరం జరిగిన చాలాసేపటి వరకూ బ్యాంకు అధికారులు గుర్తించలేకపోతున్నారు. చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేసరికే నిందితులు నగరం విడిచి వెళ్లిపోతున్నారు.

ఏటీఎంల భద్రతపై సీపీ దృష్టి

నగరంలో వరుసగా చోరీలు జరగడంతో ఏటీఎంల వద్ద భద్రతపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. ఏటీఎం కేంద్రాలు కలిగివున్న బ్యాంకుల ప్రతినిధులతోపాటు ఏటీఎం యంత్రాలకు నగదు నింపే ఏజెన్సీలతో కూడా సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని బ్యాంక్‌ల ప్రతినిధులతోపాటు నగదు నింపే ఏజెన్సీలకు నోటీసులు పంపించేందుకు చర్యలు ప్రారంభించారు. ఏటీఎంల వద్ద విధిగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించడంతోపాటు సీసీ కెమెరాలు పనిచేసేలా చూడడం, వాటి ఫుటేజీని బ్యాంక్‌ కంట్రోల్‌రూమ్‌తోపాటు పోలీసులకు కూడా అందేలా చేయడం, ఏటీఎంల బయట కూడా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం, కేంద్రాల వద్ద లైటింగ్‌ సదుపాయం ఉండేలా చూడడం, ఎవరైనా అనుమానితులు కనిపించినా, మోసం జరిగినా వెంటనే సంప్రతించేందుకు వీలుగా బ్యాంక్‌ అధికారులతోపాటు పోలీస్‌ అధికారుల నంబర్‌లు అతికించడం వంటి వాటిపై సీపీ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 01:07 AM