న్యూ ఇయర్ సందడి
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:21 PM
మన్యంలో మంగళవారం న్యూ ఇయర్ జోష్ కనిపించింది. ఏడాది ముగింపు నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో పర్యాటకులు ఏజెన్సీకి వచ్చారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి నెలకొంది.

పర్యాటక ప్రాంతాలు కిటకిట
పోటెత్తిన సందర్శకులు
బొర్రా గుహలు మొదలుకుని లంబసింగి వరకు రద్దీ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో మంగళవారం న్యూ ఇయర్ జోష్ కనిపించింది. ఏడాది ముగింపు నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో పర్యాటకులు ఏజెన్సీకి వచ్చారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి నెలకొంది.
నూతన సంవత్సర వేడుకలను పర్యాటక ప్రదేశాల్లో జరుపుకోవాలనే ఉద్దేశంతో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ మంది పర్యాటకులు ఏజెన్సీకి తరలి వచ్చారు. దీంతో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువులవేనం మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాలు రద్దీగా మారాయి. కాగా ఆయా ప్రాంతాల్లో పలువురు న్యూఇయర్ ఈవెంట్‌లను ఏర్పాటు చేశారు. పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో వివిధ ఈవెంట్‌లు, అన్‌లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్‌పై ఆఫర్లను సైతం ఇచ్చారు. పర్యాటకులు 2024కి వీడ్కోలు, 2025కు స్వాగతం పలుకుతూ ఎంజాయ్ చేశారు.
అరకులోయలో..
అరకులోయ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మంగళవారం కిటకిటలాడాయి. లాడ్జిలు, రిసార్టులు పర్యాటకులతో నిండిపోయాయి. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, ఘాట్‌రోడ్డులోని కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, మాడగడ సన్‌రైజ్ హిల్స్ రద్దీగా మారాయి.
న్యూ ఇయర్ వేడుకలు
అరకులోయ గిరిజన మ్యూజియం ఆవరణలోని మర్రి కామయ్య సాంస్కృతిక కళా వేదికలో న్యూ ఇయర్ వేడుకలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. థింసా నృత్యంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మిమిక్రీ, పాటలు, డ్యాన్స్‌లతో కళాకారులు అలరించారు. రాత్రి 12 గంటల వరకు మ్యూజియానికి సందర్శకులను అనుమతించారు. పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున టికెట్ రేటు నిర్ణయించారు.