Share News

‘పది’కి కొత్త సిలబస్‌

ABN , Publish Date - May 19 , 2024 | 12:43 AM

నూతన విద్యా విధానాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా నూతన పాఠ్యాంశాలతో కూడిన పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుతున్నాయి.

‘పది’కి కొత్త సిలబస్‌
పదో తరగతి పాఠ్యపుస్తకాలు

సీబీఎస్‌ఈకి అనుబంధంగా పాఠ్యాంశాల రూపకల్పన

ఏడు పుస్తకాల స్థానంలో 11 పాఠ్య పుస్తకాలు

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడమే ధ్యేయమంటున్న విద్యాశాఖాధికారులు

నర్సీపట్నం, మే 18:

నూతన విద్యా విధానాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా నూతన పాఠ్యాంశాలతో కూడిన పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుతున్నాయి. గత ఏడాది తొమ్మిదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేయడంతో దానికి కొనసాగింపుగా ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌ మొత్తాన్ని ప్రభుత్వం మార్చివేసింది. పాత సిలబస్‌కు భిన్నంగా విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని మెరుగుపరిచేలా కొత్త సిలబస్‌లో పాఠ్యాంశాలు ఉంటాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసిన వైసీపీ ప్రభుత్వం గత ఏడాది తొమ్మిదో తరగతి నుంచి ప్రయోగాత్మకంగా కొత్త పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ విద్యార్థులంతా ఈ ఏడాది పదో తరగతిలోకి వస్తుండడంతో సిలబస్‌ కొనసాగింపుగా సీబీఎస్‌ఈని పోలే విధంగా పాఠ్యాంశాలు రూపొందించారని అధికారులు తెలిపారు. పాత సిలబస్‌లో తెలుగు, లెక్కలు, ఆంగ్లం, సైన్స్‌, సోషల్‌, హిందీ టెక్ట్స్‌ బుక్స్‌ ఉండేవి. కొత్త సిలబస్‌లో 11 రకాల టెక్ట్స్‌ పుస్తకాలు ఉన్నాయి. తెలుగు వాచకం, ఉపవాచకం, జీవశాస్త్రం, జియోగ్రఫీ, సోషల్‌ హిస్టరీ, ఎకనామిక్స్‌, డెమోక్రెటిక్‌ పాలిటిక్స్‌, గణిత శాస్త్రం, హిందీ వాచకం, ఉప వాచకం, ఇంగ్లీషు వాచకం, ఉపవాచకంతో పాటు వర్క్‌ పుస్తకాలు ఉన్నాయి. సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటే విద్యార్థి శ్రద్ధగా విని, ఆకళింపు చేసుకుని ఆ తరువాత వాటిని క్షుణ్నంగా చదువుతుంటారు. అయితే కొత్త సిలబస్‌లో విద్యార్థులు స్వయంగా ప్రయోగం చేసి, తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరచకునేలా తీర్చిదిద్దారని ఎంఈవో-2 నాగేంద్ర తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఈ సిలబస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:43 AM