మధ్యాహ్న భోజనానికి సరికొత్త మెనూ!
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:01 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్నం అందించే భోజనంలో మార్పులు జరగనున్నాయి.
వారంలో నాలుగు రోజులు అన్నం, ఆకుకూర పప్పు, కూర, సాంబారు, రసం
ఒక రోజు వెజ్ పలావ్, పులిహోర
రూపొందించిన పాఠశాల విద్యాశాఖ
త్వరలో పాఠశాలల్లో అమలుకు కసరత్తు
రసం బదులు పప్పు మేలని నిపుణుల సూచన
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్నం అందించే భోజనంలో మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా ప్రజల అలవాట్లను పరిగణనలో తీసుకున్న ప్రభుత్వం మెనూను రూపొందించింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజల అలవాట్ల మేరకు వారానికి నాలుగు రోజులు వైట్ రైస్‌తో కూడిన భోజనం అందిస్తారు. సోమవారం వైట్‌రైస్, తోటకూరపప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, మంగళవారం వైట్ రైస్, గుడ్డు కూర, రసం, రాగి జావ, బుధవారం వెజ్ పలావ్, బంగాళదుంపల కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, గురువారం వైట్‌రైస్, సాంబారు, గుడ్డుకూర, రాగి జావ, శుక్రవారం చింతపండుతో పులిహోర, వెజిటిబుల్స్/గోంగూర చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, శనివారం వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, రసం, రాగి జావ, స్వీట్ పొంగల్ ఇవ్వాలని ప్రతిపాదించారు.
గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఇష్టం లేకపోయినా కిచిడీ, బిర్యానీ, పొంగల్ వంటి వాటితో అందించే భోజనం తినేందుకు ఎక్కువమంది ఇష్టపడేవారు కాదు. అలవాటులేని భోజనంపై అయిష్టత చూపిన విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్ తెచ్చుకునేవారు. దీనిపై అభ్యంతరాలు వచ్చినా పాలకులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గుర్తించింది. దీనిపై మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని మెనూ మార్చాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ప్రాంతాలవారీగా ప్రజల భోజన అలవాట్లను తెలుసుకున్నారు. విద్యార్థులు ఇష్టపడి తినేలా మెనూ రూపొందించేందుకు ప్రాంతాల వారీగా వంట ఏజెన్సీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా వైట్‌రైస్‌తో కూరలు తినడాన్ని ఇష్టపడతారని వంట ఏజెన్సీలు సూచించాయి. దీంతో ప్రాంతాలవారీగా భోజనం అందించాలని మంత్రి ఆదేశించారు.
ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు రూపొందించిన ఒకే విధమైన మెనూ రూపొందించారు. దీనిని ఈ నెల 14 నుంచి అమలుచేయాలని ప్రతిపాదించారు. అదేరోజు మెగా టీచర్, పేరెంట్స్ సమావేశానికి సన్నాహాలు చేశారు. కానీ ఈ సమావేశం వచ్చేనెలకు వాయిదా పడిది. ఈ నేపథ్యంలో కొత్త మెనూ ఎప్పుడు అమల్లోకి వచ్చేదీ త్వరలో చెబుతామని విద్యాశాఖ వెల్లడించింది.
కొత్త మెనూ ఉత్తరాంధ్ర ప్రజల అలవాట్లకు అనుగుణంగా ఉందని రాష్ర్టోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమంది పైడిరాజు అన్నారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన మెనూను చాలామంది విద్యార్థులు ఇష్టపడలేదన్నారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్నారు. ఇదిలావుండగా కొత్త మెనూలో రసం బదులు పప్పు అందిస్తే పోషక విలువలతో కూడిత భోజనం అందుతుందన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఈ మార్పులు చేయాలని కోరారు.