Share News

7 నుంచి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:28 AM

స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఏప్రిల్‌ ఏడో తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ పలు శాఖల అధికారులను కోరారు.

7 నుంచి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర
వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

సమీక్షా సమావేశంలో ఆర్డీవో చిన్నికృష్ణ

అనకాపల్లి టౌన్‌, మార్చి 26: స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఏప్రిల్‌ ఏడో తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో చిన్నికృష్ణ పలు శాఖల అధికారులను కోరారు. అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో (అసిస్టెంట్‌ కమిషనర్‌) కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ అధికారులు ఆలయ పరిసరాలతోపాటు ఆలయానికి వచ్చే మార్గాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా వుంచాలని స్పష్టం చేశారు. ఆది, మంగళ, గురువారాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందుబాటులో వుంచాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిలో అమ్మవారి ముఖద్వారం నుంచి ఆలయానికి వచ్చే మార్గం, ఆలయం నుంచి పూల్‌బాగ్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా చూడాలన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర జరిగే నెల రోజులపాటుఉ ఆలయం వద్ద మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని పీటీడీ అధికారులకు సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈపీడీసీఎల్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మత్తు పదార్థాల అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్‌ అధికారులు గట్టి నిఘా పెట్టాలని చెప్పారు. సమావేశంలో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సుజాత, అనకాపల్లి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధారాణి, ఆలయ ఈవో బండారు ప్రసాద్‌, డీఎస్పీ ఎస్‌.అప్పలరాజు, సీఐలు జి.శంకరరావు, పైడపునాయుడు, ఎక్సైజ్‌ సీఐ కుమారి, ఆర్‌ఐ రమేశ్‌, జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారి సుమిత్ర, పీటీడీ ఏడీఎం రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెల 22 నుంచి అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం

నూకాంబిక అమ్మవారి ఆలయంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి భక్తులకు అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం కల్పిస్తామని, అప్పటి వరకు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సుజాత చెప్పారు. ఆర్డీవో సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఏప్రిల్‌ ఏడో తేదీ రాత్రి ప్రారంభమవుతుందని, మే ఏడో తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. వేసవి కారణంగా క్యూ లైన్లలో నిల్చునే భక్తులు ఇబ్బందులు పడకుండా తాటాకు పందిళ్లు వేయిస్తున్నామని తెలిపారు. క్యూ లైన్లలో భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ, చంటిపిల్లలకు పాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీసీ చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 12:28 AM