Share News

నిర్లక్ష్యం తాండవం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:06 AM

తాండవ రిజర్వాయర్‌ పట్ల పాలకుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. కుడి, ఎడమ కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికతీత పనులు చేపట్టకపోవడంతో పొలాలకు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడు తున్నారు. అలాగే రిజర్వాయర్‌ గేట్లు దెబ్బతిని నీరు వృథాగా పోతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం తాండవం
తాండవ ఎడమ కాలువ పారుపల్లి వారి పాకల దగ్గర గేట్లు పూర్తిగా దెబ్బతిన్న దృశ్యం

- పూడుకుపోయిన తాండవ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువలు

- రెండేళ్ల క్రితం గేట్లు దెబ్బతిన్నా పట్టించుకోని పాలకులు, అధికారులు

- సాగునీరు అందక రైతులు గగ్గోలు

నాతవరం, ఫిబ్రవరి 24:

తాండవ రిజర్వాయర్‌ పట్ల పాలకుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. కుడి, ఎడమ కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికతీత పనులు చేపట్టకపోవడంతో పొలాలకు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడు తున్నారు. అలాగే రిజర్వాయర్‌ గేట్లు దెబ్బతిని నీరు వృథాగా పోతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్‌ అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 52 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. తాండవ కుడి కాలువ 15 కిలోమీటర్లు పొడవు, ఎడమ కాలువ 19 కిలోమీటర్ల పొడవు ఉంది. అయితే రెండేళ్ల నుంచి కుడి, ఎడమ కాలువల్లోని పూడికలను తొలగించడం లేదు. దీంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు. తాండవ మెయిన్‌ గేట్ల నుంచి రెండేళ్లుగా లీకేజీల వల్ల నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఖరీఫ్‌ వరి పంట సాగు చేసే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే తాండవ కుడి, ఎడమ కాలువల్లో చాలా చోట్ల పిల్ల కాలువలకు నీరు పంపే గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు కొత్తగా గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో మెట్టప్రాంత భూములకు సరిగ్గా సాగునీరు అందడం లేదు. తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం తెలిపే పెయింటింగ్‌ పూర్తిగా పోవడంతో ఎన్ని అడుగుల నీటి నిల్వలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా ఉందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. సుందరీకరణలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్యామ్‌పై కడియం నుంచి తెచ్చిన వివిధ రకాల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. డ్యామ్‌పై విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో అంధకారంగా ఉంటోంది. డ్యామ్‌ దిగువన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన పార్కు ఇప్పుడు అధ్వానంగా తయారైంది. కాగా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని, రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువల్లో పూడికలు తొలగించాలని, డ్యామ్‌పై అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:06 AM