Share News

రైల్వే స్టేషన్‌ కిటకిట

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:13 AM

పండుగ ప్రయాణాలు ఊపందుకున్నాయి. శనివారం ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది.

రైల్వే స్టేషన్‌ కిటకిట

పండుగ ప్రయాణాలతో కిక్కిరిసిన రైళ్లు

రత్నాచల్‌, గోదావరి, విశాఖ, గరీబ్‌రధ్‌, ప్రశాంతి సహా పలు రైళ్లకు అత్యధిక డిమాండ్‌

విశాఖపట్నం, జనవరి 13:

పండుగ ప్రయాణాలు ఊపందుకున్నాయి. శనివారం ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది. విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్‌ రైళ్లతోపాటు దూర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసి కనిపించాయి. ఉదయం 6.15 గంటలకు బయలుదేరే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805) నుంచి సాయంత్రం ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519) వరకు రద్దీ కొనసాగింది.

విజయవాడ, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే అత్యధిక ప్రయాణికులు మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఆశ్రయించారు. కుటుంబ సమేతంగా బయలుదేరినవారు రత్నాచల్‌లో సీట్ల కోసం రెండు గంటల ముందుగానే స్టేషన్‌కు చేరుకుని క్యూలో నిరీక్షించారు. మరొకొందరు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17488)ను ఆశ్రయించారు. ఇక సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి (12727), విశాఖ (17015), గరీబ్‌రధ్‌ (12739), ఎల్‌టీటీ (18519), ఫలక్‌నూమా (12703), కోణార్క్‌ (11020) ఎక్స్‌ప్రెస్‌లన్నీ నిండు బెర్తులతో కిక్కిరిసి నడిచాయి. అలాగే బెంగళూరు, చెన్నై పట్టణాలకు వెళ్లే భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463), హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12863), కోరమండల్‌ (12841), మెయిల్‌ (12839), బొకారో (13351) వంటి ప్రతిరోజు నడిచే రైళ్లతోపాటు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లు రద్దీగా నడిచాయి. కాగా విజయనగరం, శ్రీకాకుళం, పలస, రాయగడ, భువనేశ్వర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్‌ రైళ్లు శనివారం ప్రయాణికులతో కిక్కిరిశాయి.

ఆర్టీసీకి తాకిడి

310 ప్రత్యేక సర్వీసులు నడిపిన అధికారులు

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 13:

ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి శనివారం మరింత పెరిగింది. దీంతో పీటీడీ విశాఖ రీజియన్‌ అధికారులు స్టీల్‌సిటీ, గాజువాక, సింహాచలం, మద్దిలపాలెం కాంప్లెక్సుల నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు 310 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఉదయం నుంచి రాత్రి 9.00 గంటల వరకూ శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, రాజాం, పాతపట్నం ప్రాంతాలకు 130 ప్రత్యేక సర్వీసులు నడిపారు. అలాగే విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు ప్రాంతాలకు 120, విజయవాడకు 15, అమలాపురానికి 10, నర్సీపట్నం 15, కాకినాడకు 20 ప్రత్యేక సర్వీసులు నడిపారు. షెడ్యూల్‌ సర్వీసులకు మించి ప్రయాణికుల డిమాండ్‌ ఉండడంలో ప్రత్యేక సర్వీసులు నడిపినట్టు రీజనల్‌ మేనేజర్‌ అంధవరపు అప్పలరాజు తెలిపారు.

సొంతూళ్లకు పయనం

బారులుతీరిన వాహనాలు

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):

నగరవాసుల్లో పలువురు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు నిమిత్తం నగరంలో ఉంటున్నవారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో శనివారం ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అటు రాజమండ్రి వైపు వెళ్లే రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ వందలాది వాహనాలు బారులు తీరి కనిపించాయి. అలాగే ప్రయాణికులతో రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడాయి. ఇకపోతే షాపింగ్‌మాల్స్‌, వస్త్ర దుకాణాలు కూడా కొనుగోలుదారులతో కిక్కిరిసి కనిపించాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాలు రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Jan 14 , 2024 | 01:13 AM