Share News

నత్తనడకన ‘జల్‌ జీవన్‌’

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:45 PM

ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు ద్వారా తాగునీరు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతోంది. జిల్లాలో జల్‌ జీవన్‌ పథకం పనులు ముందుకు సాగడం లేదు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయి.

నత్తనడకన ‘జల్‌ జీవన్‌’
అనకాపల్లి మండలం మారేడుపూడిలో పైపులు తెచ్చి అమర్చకుండా వదిలేసిన దృశ్యం

సకాలంలో నిధులు విడుదల కాక ముందుకుసాగని పనులు

కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం వల్లే సమస్యలని ఆరోపణలు

ఇంటింటికీ కొళాయి ఎప్పటికి

అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఇంటింటికీ కొళాయిల ఏర్పాటు ద్వారా తాగునీరు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతోంది. జిల్లాలో జల్‌ జీవన్‌ పథకం పనులు ముందుకు సాగడం లేదు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయి. నిధుల కొరత లేదని గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని మండలాల్లో అయితే పనులు పదిశాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 2017-18 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి జిల్లా పరిధిలోని మండలాల్లో 4.18 లక్షల కుటుంబాలకు జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ఇంటింటికి కొళాయిలు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో 2,163 ప్యాకేజీల కింద పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాది కాలం పాటు పనులు నిలిచిపోయాయి. 2020లో మళ్లీ జల్‌జీవన్‌ పనులను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించినా సకాలంలో నిధులు విడుదలకాకపోవడం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వంటి కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 2022-23 సంవత్సరం నాటికి 2,52,402 లక్షల కుటుంబాలకు మాత్రమే కొళాయిలు అమర్చారు. 2023-24లో మరో 10,694 కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 2,63,096 కొళాయిలు మాత్రమే ఇచ్చారు. మిగతా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పైపులు గ్రామాలకు చేరవేసినా ఏర్పాటు మాత్రం చేయలేదు. మరికొన్ని చోట్ల కొళాయిలు అమర్చి నీరు ఇవ్వకుండా అరకొరగా పనులు చేపట్టారు.

బిల్లులు అందక పనులు నత్తనడకన

జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు వేగవంతంగా సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని తెలిసింది. జిల్లాలో ఇప్పటికే కాంట్రాక్టర్లు చేసిన పనులకు రూ.6 కోట్లు వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అనకాపల్లి, మునగపాక, కశింకోట మండలాల పరిధిలో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అనకాపల్లి మండలం మారేడుపూడి, గొలగాం పంచాయతీల్లో పనులు నెలల తరబడి కొనసాగుతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకే తెలియడం లేదు. కశింకోట మండలంలో 78 గ్రామాల్లో పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. వీటిలో 32 చోట్ల పనులు ప్రారంభమైనా పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో కేవలం 4,300 ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇవ్వగలిగారు. గొలుగొండ మండలంలో 18 గ్రామాల్లో ఇంటింటా కొళాయిలు ఏర్పాటు చేయాలని భావించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చోడవరం మండల పరిధిలోని గ్రామాల్లో 18 వేల ఇళ్లకు ఇంటింటికి కొళాయిలు అమర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నా, పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 12 వేల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామని, బిల్లుల చెల్లింపులు జరగుతున్నాయో?, లేదో అనేది తమకు సమాచారం ఉండదని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. వేసవీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన ఇంటింటికి కొళాయిల ఏర్పాటు పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:46 PM