Share News

ఎన్నికలకు నగారా

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:10 AM

ఎన్నికల కదన రంగానికి గురువారం నగారా మోగుతోంది.

ఎన్నికలకు నగారా

నేడే నోటిఫికేషన్‌ విడుదల

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకారం

25వ తేదీ వరకూ అవకాశం

ఉపసంహరణకు 29వ తేదీ వరకూ గడువు

లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లు కలెక్టరేట్‌లో స్వీకరణ

ఆన్‌లైన్‌లోనూ దాఖలుకు అవకాశం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల కదన రంగానికి గురువారం నగారా మోగుతోంది. వచ్చే నెల 13వ తేదీన నిర్వహించనున్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీచేయనున్నది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన విధి విధానాలను ముందే వెల్లడించింది.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలో గల ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌సభ నియోజక వర్గానికి సంబంధించిన నామినేషన్లు జిల్లా కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున స్వీకరిస్తారు. ఆ సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తారు. మిగిలిన వారిని కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఆపేస్తారు. అలాగే నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థి తరపున మూడు వాహనాలను అనుమతిస్తారు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఒకరు బలపరచాలి. అయితే బలపరిచే వ్యక్తికి ఓటు ఉండాలి. ఇండిపెండెంట్‌ అయితే పది మంది ఓటర్లు బలపరచాలి. లోక్‌సభకు నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థి జనరల్‌ అయితే రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500, అసెంబ్లీకి అయితే జనరల్‌ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.ఐదు వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఇదిలావుండగా ఈ పర్యాయం ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సువిధ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తరువాత వాటి నకళ్లు సంబంధిత ఆర్వో కార్యాలయాలకు అందజేసి ప్రమాణం చేయాల్సి ఉంటంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ సమయం ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేసినప్పటి అభ్యర్థుల ఖర్చును లెక్కిస్తారు. అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షలు, లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షల వరకూ ఖర్చుకు అవకాశం ఉంది.

పోస్టల్‌ ఓటింగ్‌లో మార్పులు

ఈసారి సర్వీస్‌ ఓటర్లకు మాత్రమే అవకాశం

ఉద్యోగులు, పోలీసుల కోసం 5,6 తేదీల్లో ఏయూలో ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు

ఇంటి వద్ద నుంచి ఓటు వినియోగించుకునేందుకు 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం

నేటి నుంచి సర్వే

జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మంది వృద్ధులు,

3,200 మంది దివ్యాంగులు ఉంటారని అంచనా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

పోస్టల్‌ ఓటింగ్‌ విధానంలో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. కేవలం సర్వీస్‌ (త్రివిధ దళాల్లో పనిచేసే వారికి) మాత్రమే ఈసారి పోస్టల్‌ ద్వారా ఓటింగ్‌కు అవకాశం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి నేతృత్వంలో ఏర్పాటుచేసే ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో సర్వీస్‌, ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాకు చెందిన సుమారు మూడు వేల మంది సర్వీస్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం అంటే ఈనెల 29వ తేదీన బరిలో అభ్యర్థులు ఎవరన్నది తేలనున్నది. ఆ మరుసటిరోజు సర్వీస్‌ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా సంబంధిత యూనిట్‌ అఽధికారులకు ఆన్‌లైన్‌లో సమాచారం పంపుతారు. యూనిట్‌ అధికారి సూచన మేరకు అక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని బ్యాలెట్‌ పత్రాన్ని పోస్టల్‌ ద్వారా జిల్లాకు పంపుతారు. కాగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్‌లో ఓటు వేసే విధానాన్ని ఈ పర్యాయం రద్దు చేశారు. జిల్లాలో సుమారు 14,500 మంది ఉద్యోగులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. వచ్చే నెల ఐదో తేదీన రెండో విడత శిక్షణ తరగతులు ఉన్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారికి పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేస్తారు. ఐదో తేదీతోపాటు ఆరో తేదీన కూడా ఓటు వేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిఽధులు పర్యవేక్షించేలా అవకాశం ఇస్తారు. వచ్చే నెల పోస్టల్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయాన్ని రద్దు చేశారు.

నేటి నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు కోసం సర్వే

వచ్చేనెల ఏడోతేదీన ఇంటి వద్దే ఓటింగ్‌

85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతం వరకు సదరం సర్టిఫికెట్‌ ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు కల్పించడానికి గురువారం నుంచి సర్వే చేయనున్నారు. జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మంది వృద్ధులు, 3,200 మంది దివ్యాంగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా ఈ రెండు కేటగిరీ వివరాలను బూత్‌ లెవెల్‌ అధికారులకు అందజేశారు. ప్రతి బీఎల్‌వో తన పరిధిలో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటారా?, లేదా పోలింగ్‌ బూత్‌కు వస్తారా? అని అడుగుతారు. ఒకవేళ ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటామంటే వెంటనే వివరాల మేరకు రిజిస్టర్‌ చేసుకుని ఫారం 12 (డీ) అందజేస్తారు. వచ్చే నెల ఏడో తేదీన జిల్లాలో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు మొబైల్‌ పోలింగ్‌ సెంటర్‌తో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. వృద్ధులు/దివ్యాంగులకు బ్యాలెట్‌ ఇచ్చి, వారు ఓటు వేసిన తరువాత కవర్‌లో పెట్టి బ్యాలెట్‌ బాక్సులో వేయాలి. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ఏజెంట్లుగా పాల్గొనే అవకాశం ఇస్తారు. ఓటు వినియోగించుకునేందుకు వీలుగా రెండుసార్లు ప్రతి ఒక్కరి ఇంటికి వెళతారు. కాగా ఇంటి వద్దే ఓటు వినియోగించుకునేందుకు అంగీకారం తెలిపి తరువాత ఓటు వేయని వృద్ధులు, దివ్యాంగులు....వచ్చే నెల 13వ తేదీన సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం కోల్పోతారు.

నామినేషన్ల స్వీకరించే కార్యాలయాలు

లోక్‌సభ

విశాఖపట్నం లోక్‌సభ స్థానం కలెక్టర్‌ కార్యాలయం

అసెంబ్లీ

1. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం భీమిలి ఆర్డీవో కార్యాలయం

2. విశాఖ తూర్పు కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌

3. విశాఖ దక్షిణ మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయం

4. విశాఖ ఉత్తరం సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయం

5. విశాఖ పశ్చిమ జీవీఎంసీ జోన్‌-5 కార్యాలయం, జ్ఞానాపురం

6. గాజువాక గాజువాక తహసీల్దార్‌ కార్యాలయం

7. పెందుర్తి పెందుర్తి తహసీల్దార్‌ కార్యాలయం

నామినేషన్ల స్వీకరణకు

విస్తృత ఏర్పాట్లు

ఒక్కొక్కరు నాలుగు సెట్లు దాఖలు చేయవచ్చు

పరిశీలనకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు

కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి అభ్యర్థి సహా ఐదుగురికి,

మూడు వాహనాలకు మాత్రమే అనుమతి

సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు చేసేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురిని, మూడు వాహనాలను మాత్రమే కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి అనుమతిస్తామన్నారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని, నామినేషన్ల పరిశీలనకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారంతో కూడిన కిట్‌ అందజేస్తామన్నారు. నామినేషన్లు దాఖలు చేసే ముందు ఆర్వోలు ఒకసారి పరిశీలించి ఇంకేమైనా డాక్యుమెంట్లు కావాలా?...అనేది అభ్యర్థికి చెబుతారని, వాటిని ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు సమర్పించాలన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి ప్రమాణం చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అభ్యర్థి తరపున మరొకరు కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చునని, అయితే అప్పుడు కూడా ఒకరోజు అభ్యర్థి వచ్చి ప్రమాణం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థికి సంబంధించి ఏమైనా క్రిమినల్‌ కేసులు ఉంటే వాటి వివరాలను పత్రికల్లో మూడుసార్లు పబ్లిష్‌ చేయించాలన్నారు. నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత అదేరోజు అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 50 శాతానికి మించి పోలింగ్‌ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేసి వాటిని కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 293 పోలింగ్‌ కేంద్రాల్లో 79 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నప్పటికీ 265 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్‌ ఉంటారన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీల్‌చైర్లు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. కాగా తొలివిడతలో అసెంబ్లీ నియోజక వర్గాలకు ఈవీఎంల కేటాయింపు కోసం ర్యాండమైజేషన్‌ పూర్తయిందన్నారు. మే ఒకటి నాటికి బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారో అనేది తేలనున్నందున ఈవీఎంలలో బ్యాలెట్‌ పేపరు ఫీడ్‌ చేసి సీల్‌ వేస్తామన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు నిర్వహణలో సాంకేతిక లోపాలు సవరించేందుకు భెల్‌, ఈసీఐఎల్‌ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని జేసీ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల నిర్వహణకు సంబంధించి ఒక యాప్‌ను పీవోలకు పంపిస్తామని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు ఒక విడత శిక్షణ ఇచ్చామని, వచ్చే నెల ఐదో తేదీన రెండో విడత, 8, 9 తేదీల్లో మూడో విడత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 02:10 AM