Share News

కన్నులపండువగా మోదకొండమ్మ ఉత్సవాలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:16 AM

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

కన్నులపండువగా మోదకొండమ్మ ఉత్సవాలు

రెండో రోజు అమ్మవారికి ఘనంగా పూజలు

ఊరంతా విద్యుద్దీపాల అలంకరణలు

అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నేడు అనుపోత్సవం...ప్రత్యేక ఏర్పాట్లు

పాడేరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అలాగే పట్టణంలో కనులు మిరమిట్లుగొల్పేలా విద్యుద్దీపాలను అలంకరించారు. ఉత్సవ కమిటీ ఏర్పాటుచేస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.

మోదకొండమ్మ జాతర తొలిరోజు ఆదివారం శతకంపట్టులో అమ్మవారిని కొలువుతీర్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలును మంగళవారం తిరిగి ఆలయంలో అనుపుతీర్చే తంతును అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొలి రోజును మించి ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రకరకాల నృత్యాలు, వేషాలు, డప్పుల వాయిద్యాల సందడి వాతావరణంలో ఉత్సవమూర్తిని, పాదాలును ఊరేగిస్తారు. అలాగే అనుపోత్సవం ముగిసిన తర్వాత బాణసంచా కాలుస్తారు. ఇది ఉత్సవాలకే ప్రత్యేకంగా ఉంటుంది. మంగళవారం రాత్రంతా భక్తులను అలరించేందుకు సినీ, టీవీ, జానపద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. రాత్రంతా ఆయా కార్యక్రమాలను తిలకించి బుధవారం నుంచి భక్తులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతారు. రెండో రోజు భక్తులకు అవసరమైన మధ్యాహ్న భోజనాలు, తాగునీరు, మరుగుదొడ్లను ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు సమకూర్చారు.

సందడే..సందడి

పాడేరులో మోదకొండమ్మ ఉత్సవ సందడి నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ అలంకరణ, వివిధ ప్రదర్శనలు భక్తుల్లో ఉత్సాహం నింపాయి. అంబేడ్కర్‌ కూడలి వద్ద నలువైపులా ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్లు, ఎల్‌ఈడీ బోర్డులు కనువిందు చేస్తున్నాయి. అలాగే విశాఖపట్నం వెళ్లే మార్గం, మెయిన్‌ బజార్‌, శతకంపట్టు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మార్గంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ అలంకరణలు, అంబేడ్కర్‌ కూడలి వద్ద అయోధ్య ఆలయం, కోల్‌కతా కాళికా ఆలయం నమైనా లైటింగ్‌ ఆకట్టుకుంటున్నాయి. అలాగే జెయింట్‌ వీల్‌, ప్లే జోన్‌లోనూ విద్యుత్‌ వెలుగులు జిగేల్‌మంటున్నాయి. అలాగే సాయంత్రం వేళలో ఏర్పాటు చేస్తున్న గరగర నృత్యం, కేరళ ఓనం బ్యాండ్‌, దేవతామూర్తుల వేషాల ప్రదర్శనలు అలరిస్తున్నాయి. పట్టణ వీధుల్లో అధిక సంఖ్యలో జనం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ కుటుంబాలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొట్టగుళ్లి రామారావు, ప్రధాన కార్యదర్శులు టి.ప్రసాదరావునాయుడు, వై.శ్రీను, కె.వెంకటరమణ, సభ్యులు వి.రాజబాబు, డి.బాబూరావు, వి.వెంకటరత్నం, ముకుందరావు, ఎస్‌.శ్రీనివాసకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 02:16 AM