Share News

మాక్‌ డ్రిల్లేనట!

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:24 AM

ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి (అలలపై వంతెన)పై అధికారులు అసంబద్ధ వాదనలు చేస్తున్నారు.

మాక్‌ డ్రిల్లేనట!

ఫ్లోటింగ్‌ బ్రిడ్జిపై అధికారుల వాదన

కావాలనే ‘టి జంక్షన్‌ వ్యూ పాయింట్‌’ను దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశారట

ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత?

అసలు అనుమతులే లేవు

కానీ నిపుణులు చెప్పారని ప్రకటనలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి (అలలపై వంతెన)పై అధికారులు అసంబద్ధ వాదనలు చేస్తున్నారు. ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభించిన 24 గంటలలోపే రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు మాత్రం మాక్‌ డ్రిల్‌లో భాగంగానే ‘టి జంక్షన్‌ వ్యూ పాయింట్‌’ను దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామని చెబుతున్నారు. ఈ విషయంలో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే...ఆ ప్రాంతంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసుకోవచ్చునని నిపుణులు సూచించారని కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ మల్లికార్జున మంగళవారం కూడా మరోసారి ఉద్ఘాటించారు. ఆ నిపుణులు ఎవరో, ఏమని నివేదిక ఇచ్చారో వెల్లడించడం లేదు. ఆ ప్రాజెక్టుకు పర్యాటక శాఖ నుంచి అనుమతి ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పడం లేదు. కురుసుర సబ్‌మెరైన్‌ ఏరియా అంతా అత్యంత ప్రమాదకరమైనది. అక్కడ ఈతకు దిగకూడదని జీవీఎంసీ అధికారులే హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలో బలమైన అలలు తాకడం వల్ల తీరం తరచూ కోతకు గురవుతుంటుంది. ఈ విషయం విశాఖపట్నం పోర్టు, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అందరికీ తెలుసు. అటువంటిచోట సముద్రంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి పెట్టారు. పౌర్ణమి కారణంగా సముద్రం పోటు వల్ల కెరటాలు పెద్దగా వస్తున్నాయని, అందుకే పర్యాటకులను అనుమతించడం లేదని చెబుతున్నారు. పౌర్ణమి రోజులని తెలిసీ ప్రాజెక్టును ఆదివారం ప్రారంభించాల్సిన అవసరం ఏమిటి?...అలాగే సోమవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తామని ప్రకటించి, ఆ సమయంలో ‘టి జంక్షన్‌ వ్యూ పాయింట్‌’ను విడిగా తీసుకువెళ్లి లంగరు వేయడం ఏమిటి?, దానికి మళ్లీ మాక్‌ డ్రిల్‌ అని చెప్పడం ఏమిటి?...ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రాజెక్టు ప్రారంభానికి ముందే చూసుకోవాలి గదా. అధికారికంగా, అట్టహాసంగా ప్రారంభించి, ఆ మరుసటిరోజు నుంచి పర్యాటకులను అనుమతిస్తామని చెప్పి...మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నామని చెప్పడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు పర్యాటకులను ఆకట్టుకునేదే.. అందులో అనుమానం లేదు. కానీ సురక్షితమైన ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సిన దానిని ప్రమాదాలు జరిగే చోట పెట్టడమే ఏమిటనే దానిపైనే అభ్యంతరాలన్నీ. ఎక్కడో ఓ చోట పెట్టేసి చేతులు దులిపేసుకోవాలని అన్నట్టుగానే ఉంది అధికారుల తీరు. పౌర్ణమి అని, అలల తీవ్రత అని ఈ ప్రాజెక్టును నెలకు ఎన్నిసార్లు మూసేస్తారో కూడా అధికారులు చెప్పాల్సి ఉంటుంది. అధికారులు పలు అంశాల్లో తప్పులను ఒప్పుకోకుండా సమర్థించుకోవడం నగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇందులో అత్యుత్సాహం లేదని నిరూపించుకోవాలంటే...ఈ ప్రాజెక్టును ఆర్‌కే బీచ్‌లో పెట్టాలని సూచించిన నిపుణులు ఎవరో చెప్పాలి. అధికారికంగా తీసుకున్న అనుమతులు ఏమిటో మీడియాకు వివరించాలి.

Updated Date - Feb 28 , 2024 | 01:24 AM