Share News

ఎమ్మెల్యే మాటలు.. నీటి మూటలు!

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:10 AM

మండలంలో యు.చీడిపాలెం, మఠంభీమవరం పంచాయతీల పరిధిలోని 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి బండిగెడ్డపై వంతెనల నిర్మాణ హామీలు వరదలో కొట్టుకుపోతున్నాయి. దీంతో ఏటా వర్షాకాలంలో గెడ్డ పొంగితే పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. బండిగెడ్డపై గొట్టెలపాడు, ఈదులబంద గ్రామాల వద్ద వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చెప్పి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు మాత్రం మొదలు కాలేదు.

ఎమ్మెల్యే మాటలు.. నీటి మూటలు!
గొట్టెలపాడు వద్ద బండిగెడ్డపై వంతెన నిర్మించాల్సి ప్రదేశం (ఫైల్‌ ఫొటో)

బండిగెడ్డపై మూడుచోట్ల వంతెనల నిర్మాణానికి రూ.6.85 కోట్లు మంజూరైనట్టు వెల్లడి

ఏడాదిన్నర దాటినా మొదలుకాని పనులు

బండిగెడ్డ వరదలో కొట్టుకుపోయిన భాగ్యలక్ష్మి హామీలు

కలగానే వంతెనల నిర్మాణం

యు.చీడిపాలెం, మఠంభీమవరం పంచాయతీల గిరిజనులకు తప్పని ఇక్కట్లు

కొయ్యూరు, ఫిబ్రవరి 16: మండలంలో యు.చీడిపాలెం, మఠంభీమవరం పంచాయతీల పరిధిలోని 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి బండిగెడ్డపై వంతెనల నిర్మాణ హామీలు వరదలో కొట్టుకుపోతున్నాయి. దీంతో ఏటా వర్షాకాలంలో గెడ్డ పొంగితే పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. బండిగెడ్డపై గొట్టెలపాడు, ఈదులబంద గ్రామాల వద్ద వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చెప్పి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు మాత్రం మొదలు కాలేదు.

మండల కేంద్రానికి సుదూరంలో వున్న యు.చీడిపాలెం, మఠంభీమవరం పంచాయతీల పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే మధ్యలో బండిగెడ్డను దాటాలి. ఇక్కడ కల్వర్టులు మాత్రమే వుండడంతో వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో కల్వర్టు పూర్తిగా మునిగిపోతుంది. ఒక్కోసారి దీనిపై ఐదారు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. అత్యవసర పనుల మీద ఎవరైనా గెడ్డ దాటడానికి సాహసిస్తే.. వరద నీటిలో కొట్టుకుపోవాల్సిందే. గతంలో ఈ తరహా సంఘటనలు జరిగాయని పలు గ్రామాలు గిరిజనులు చెబుతున్నారు. వరద తీవ్రత తగ్గే వరకు ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు వుండవు. ప్రాణాపాయ స్థితిలో వున్న రోగులను, పురుటి నొప్పులు వచ్చిన గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వీలుకాని పరిస్థితి నెలకొంటుంది. బండిగెడ్డపై ఆయా ప్రదేశాల్లో వంతెనలు నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు చాలా ఏళ్ల నుంచి పాలకులను, అధికారులను కోరుతున్నారు. 2021 జూలైలో ఈ ప్రాంతంలో పర్యటించిన అరకు ఎంపీ జి.మాధవి, బండిగెడ్డపై వంతెనల నిర్మాణానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా చర్యలు చేపట్టారు. తరువాత 2022 జూలైలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. యు.చీడిపాలెం, మఠంభీమవరం పంచాయతీల్లో పర్యటించి గొట్టెలపాడు వద్ద వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు, ఈదులబంద వద్ద వంతెన నిర్మాణానికి రూ.2.35 కోట్లు, వేమనపాలెం వద్ద వంతెన నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారు. ఇది జరిగి సుమారు ఏడాదిన్నర దాటినా వంతెనలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వంతెనల నిర్మాణానికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇచ్చిన హామీలు బండిగెడ్డ వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:10 AM