ఫార్మా రసాయన వ్యర్థాల డ్రమ్ముల కలకలం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:38 PM
ప్రమాదకరమైన ఫార్మా రసాయన వ్యర్థాలతో కూడిన డ్రమ్ముల డంపింగ్ పెదముషిడివాడలో సోమవారం ఉదయం కలకలం రేపింది.

పెదముషిడివాడలో డంపింగ్‌తో స్థానికుల ఆందోళన
నమూనాలు సేకరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది
లంకెలపాలెం, జూలై 8: ప్రమాదకరమైన ఫార్మా రసాయన వ్యర్థాలతో కూడిన డ్రమ్ముల డంపింగ్ పెదముషిడివాడలో సోమవారం ఉదయం కలకలం రేపింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సమీపంలో గల బచ్చల చెరువులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారీగా రసాయన వ్యర్థాలతో డ్రమ్ములను డంపింగ్ చేశారు. భరించలేని దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో స్థానికులు సోమవారం బచ్చల చెరువు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఫార్మా పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ప్రమాదకరమైన విష రసాయన వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ విడిచి పెడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఫార్మాసిటీలో పలు పరిశ్రమలు వ్యర్థాలను రాంకీ ట్రిట్‌మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడి పడితే అక్కడ విడిచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ లోవరాజు, చంద్రశేఖర్‌లు అక్కడికి చేరుకొని డ్రమ్ముల్లో గల రసాయన వ్యర్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు.