Share News

వైసీపీని సముద్రంలో కలపాలి

ABN , Publish Date - May 03 , 2024 | 01:54 AM

విశాఖ ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి, భూములు లాక్కున్న వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

వైసీపీని సముద్రంలో కలపాలి

  • మార్పు కోసం ముందుకురావాలి

  • ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపు

  • ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు

  • ఇక ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు

  • మేమొస్తే శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తాం

  • రౌడీలు తోక జాడిస్తే మోకాళ్లు విరగ్గొట్టి జగదాంబ సెంటర్‌లో నిలబెడతాం

  • వైసీపీ నేతల భూ కబ్జాలపై ప్రత్యేక కమిషన్‌తో విచారణ

  • విశాఖ ప్రజల గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా

  • గూండాలకు భయపడి ఊరు వదిలి వెళ్లొద్దు

  • ముస్లింలకు పెన్షన్లు, ఇంటి స్థలాలు, రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తాం

విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి, భూములు లాక్కున్న వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆయన నగరంలోని పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో గల దుర్గాలమ్మ గుడి జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వాటాలు వేసుకొని మరీ భూములు ఆక్రమించారని, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతో వారు మరింత పెట్రేగిపోతారన్నారు. విశాఖలో సొంత ఎంపీ ఎంవీవీ కుటుంబానికే వైసీపీ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, ఇక ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు.

విశాఖలో కాలుష్యం అధికంగా ఉందని, అటు సముద్ర కాలుష్యం, ఇటు పరిశ్రమల కాలుష్యం ఎక్కువైందని, వాటిపై నియంత్రణ మండలి, కలెక్టర్‌ చర్యలు తీసుకోవడం లేదని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. జీతాలు తీసుకొని పనిచేయని అధికారులను చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని సూచించారు. తాను విశాఖలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నానని, ఈ ప్రాంతం అంటే అభిమానమని చెప్పారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు కాలిపోయినప్పుడు ఒక్కొక్కరికి రూ.50 వేలు సాయం చేస్తే, ఆ డబ్బులు తీసుకోవద్దని బాధితులను వైసీపీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. చేతనైతే సాయం చేయాలని కానీ ఇలా పేదలను కూడా బెదిరించడం వారికే చెల్లిందన్నారు. చీకటి పడితే మహిళలు ఒంటరిగా వెళ్లలేకపోతున్నారని, వారికి భద్రత లేదని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే భద్రతకు, రక్షణకు, స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా మోకాళ్లు విరగ్గొట్టి జగదాంబ సెంటర్‌లో నిలబెడతామన్నారు.

విశాఖలో అందమైన రుషికొండకు బోడిగుండు కొట్టించారని, మళ్లీ అటువంటిది తేలేమన్నారు. వైసీపీ నాయకులు సర్క్యూట్‌ హౌస్‌, దసపల్లా భూములు, క్రిస్టియన్‌ భూములు లాక్కున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారు కాజేసిన భూములపై ప్రత్యేక కమిషన్‌ వేసి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. గూండాల బెదిరింపులకు భయపడి డబ్బున్నవారు విదేశాలకు వెళ్లిపోతున్నారని, విశాఖలో ఎవరూ అలా వెళ్లాల్సిన అవసరం లేదని, నిలబడి పోరాడాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విశాఖ ప్రజల గుండెలకు నిప్పు అంటించి ధైర్యం నింపడానికే వచ్చానన్నారు. స్టీల్‌ప్లాంటు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, అలా పోరాటం చేస్తేనే ఏదైనా దక్కుతుందన్నారు. మార్పు కోసం ముందుకురావాలని, ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలని కోరారు.

విశాఖలో వైసీపీ నాయకులు ఇస్లాం బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని చేయలేదని, రంజాన్‌ తోఫా రద్దు చేశారని, షాదీ తోఫా లక్ష రూపాయిలు ఇస్తామని ఇవ్వలేదని, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పంపిణీ చేయలేదని, ఉర్దూ భాషను ప్రోత్సహించలేదని విమర్శించారు. ముస్లింలకు పెన్షన్లు, ఇంటి స్థలాలు ఇస్తామని, రూ.5 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఉపయోగపడని జీఓ నంబరు 217 రద్దు చేస్తామని, వారికి ఏడాదికి రూ.20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామన్నారు. ఈ సభలో టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌, దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌, తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తరం అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పెతంకశెట్టి గణబాబు ప్రసంగించారు.

Updated Date - May 03 , 2024 | 01:54 AM