Share News

హైస్కూళ్లలో ఉచిత భోజన, వసతి కల్పనకు చర్యలు

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:39 AM

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. బుధవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు.

హైస్కూళ్లలో ఉచిత భోజన, వసతి కల్పనకు చర్యలు
ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డీఈవో బ్రహ్మాజీరావు

- డీఈవో బ్రహ్మాజీరావు

గూడెంకొత్తవీధి, జూన్‌ 26: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. బుధవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు. పెదవలస, లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో డీఈవో భోజన, వసతి సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారన్నారు. లంబసింగి, పెదవలస ప్రభుత్వ పాఠశాలలు డే స్కూళ్లు కావడం, వసతి సదుపాయం లేకపోవడం వల్ల విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు హాస్టల్‌ సదుపాయం కల్పిస్తే విద్యార్థుల విద్యాభ్యాసానికి అనువుగా ఉంటుందన్నారు. ఈ మేరకు కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో జీకేవీధి, చింతపల్లి మండల విద్యాశాఖాధికారి తగ్గి సత్యనారాయణ, నారాయణరావు, పనసల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:39 AM