Share News

మలేరియా, డెంగ్యూ కట్టడికి చర్యలు

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:24 AM

జిల్లాలో మలేరియా, డెంగ్యూను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, వాటి కారక దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశిచారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దోమ కాటుకు వచ్చే మలేరియా, డెంగ్యూలను అరికట్టడంలో భాగంగా దోమలు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

మలేరియా, డెంగ్యూ కట్టడికి చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌

- అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పాడేరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా, డెంగ్యూను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, వాటి కారక దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశిచారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దోమ కాటుకు వచ్చే మలేరియా, డెంగ్యూలను అరికట్టడంలో భాగంగా దోమలు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,206 మలేరియా, 53 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా బాధితులను వైద్య సిబ్బంది గుర్తించి సకాలంలో వైద్య సేవలందించారన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న ఉపాధి పనులపై ఆరా తీశారు. అర్హులైన వారందరికీ జాబ్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. ఉపాధి హామీ పనులను సచివాలయ సిబ్బంది విధిగా పర్యవేక్షించాలని, రోజుకు మూడు మార్లు తమ హాజరు నమోదు చేయాలన్నారు. అలాగే వివిధ సేవల ద్వారా గ్రామ సచివాలయాలకు వచ్చే నగదును రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి విధిగా జమచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రూ.6 లక్షల 39 వేలు ఈ విధంగా జమ చేయాల్సిన సొమ్ము ప్రస్తుతం పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నెల 15న బిర్సాముండా జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని, 19న ప్రపంచ టాయిలెట్స్‌ డే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకంలో మొత్తం 25,578 ఇళ్లు మంజూరైతే 23,073 ఇళ్లకు మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఇంకా 2,505 మంది లబ్ధిదారుల ఎంపిక త్వరగా చేపట్టాలన్నారు. అలాగే గృహ నిర్మాణ సంస్థలో చేపడుతున్న వివిధ పథకాల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌ కుమార్‌, డ్వామా పీడీ శివయ్య, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా, వివిధ శాఖల జిల్లా అధికారులు, 22 మండలాల్లోని ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:24 AM