Share News

ఎలమంచిలి డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:24 AM

ఎలమంచిలి మునిసిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ తెలిపారు.

ఎలమంచిలి డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు
యానాద్రి కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్‌

ఎలమంచిలి, జూన్‌ 17 : ఎలమంచిలి మునిసిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ తెలిపారు. మునిసిపాలిటీలో సోమవారం తొలిసారిగా పర్యటించిన ఎమ్మెల్యే విజయకుమార్‌కు మునిసిపల్‌ కార్యాలయం వద్ద స్థానిక నేతలు, మునిసిపల్‌ అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి గజమాలతో సత్కరించారు. అనంతరం ద్విచక్ర వాహనంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మునిసిపల్‌ అధికారులతో కలిసి పట్టణ డ్రైనేజీ వ్యవస్థతో పాటు సాగునీటి కాలువలను పరిశీలించారు. తొలుత తులసీనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీ, నాగేంద్ర కాలనీ, కొత్తపేట కాలనీల మీదుగా పయనిస్తున్న డ్రైనేజీలు, సాగునీటి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మిలట్రీ కాలనీకి చేరుకున్న ఎమ్మెల్యేకు టీడీపీ నేత దత్తాత్రేయ మొక్కను జ్ఞాపికగా అందజేశారు. పట్టణ డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం నుంచి ఔట్‌ఫ్లో వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఎమ్మెల్యే సుందరపు మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం అచ్యుతాపురంలోను, సోమవారం ఎలమంచిలిలో పర్యటించానన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. పట్టణంలో గత 20 సంవత్సరాలకుపైగా డ్రైనేజీ వ్యవస్థ దయనీయంగా ఉందన్నారు. వర్షాలు పడిన సమయంలో పట్టణంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాల్సినఅవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ కారణంగా దోమల వ్యాప్తి పెరిగిపోతున్నాయన్నారు. కొత్తపేటలో న్యాయవాది శ్రీనివాస పట్నాయక్‌ యానాద్రి కాలువ పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించారు. లొట్లవారి వీధిలో మహిళలు ఇదే సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణలో నివాసితులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. వార్డుల్లో ఎమ్మెల్యేకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమస్యలను స్థానికులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ ప్రభాకరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు తదితరులతో సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ పట్టణ అధ్యక్షులు బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, కూటమి పార్టీల నేతలు కొఠారు సాంబ, పిట్టా శ్రీను, లవుడు లోవరాజు, కొఠారు నరేష్‌, ఆదిమూర్తి, లంక రాజు, బొద్దపు శ్రీను(రమణ), పల్లా సత్యనారాయణ, కరణం రవి, చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 01:24 AM