Share News

కాఫీ గింజల ఉత్పత్తిలో నాణ్యత పాటిస్తే గరిష్ఠ ధరలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:38 AM

ఆదివాసీ రైతులు కాఫీ గింజల ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే గిరిష్ఠ ధరలు పొందవచ్చునని కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌(విస్తరణ) ఎస్‌.రమేశ్‌ తెలిపారు. సోమవారం స్థానిక కాఫీ శుద్ధి కర్మాగారంలో ఆదివాసీ రైతులకు రాయితీ ఎలకా్ట్రనిక్‌ పల్పర్లను పంపిణీ చేశారు.

కాఫీ గింజల ఉత్పత్తిలో నాణ్యత పాటిస్తే గరిష్ఠ ధరలు
కాఫీ రైతు రాములమ్మకు ఎలకా్ట్రనిక్‌ కాఫీ పల్పర్‌ అందజేస్తున్న డీడీ రమేశ్‌

- కాఫీ బోర్డు డీడీ రమేశ్‌

చింతపల్లి, మార్చి 11: ఆదివాసీ రైతులు కాఫీ గింజల ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే గిరిష్ఠ ధరలు పొందవచ్చునని కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌(విస్తరణ) ఎస్‌.రమేశ్‌ తెలిపారు. సోమవారం స్థానిక కాఫీ శుద్ధి కర్మాగారంలో ఆదివాసీ రైతులకు రాయితీ ఎలకా్ట్రనిక్‌ పల్పర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ రైతులు కాఫీ గింజలను చెర్రీగా విక్రయించుకుని, అధిక ధర పొందలేకపోతున్నారన్నారు. రైతులు పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసుకుని మార్కెటింగ్‌ చేసుకుంటే రెట్టింపు ధర వస్తుందన్నారు. గతంలో ఆదివాసీ రైతులకు కాఫీ బోర్డు హ్యాండ్‌ పల్పర్లను పంపిణీ చేసేదన్నారు. దీంతో రైతులు పార్చిమెంట్‌ తయారీకి అధికంగా శ్రమించాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ఎలకా్ట్రనిక్‌ పల్పర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ పల్పర్ల వినియోగం వల్ల తక్కువ సమయంలో అధిక కాఫీ పండ్లను పార్చిమెంట్‌గా ఉత్పత్తి చేసుకోవచ్చునని, శ్రమ తగ్గుతుందన్నారు. ఈ ఎలకా్ట్రనిక్‌ కాఫీ పల్పర్‌ ధర రూ.58,248 కాగా, 50 శాతం కాఫీ బోర్డు, 35 శాతం ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ రాయితీ కల్పిస్తుందన్నారు. రైతు కేవలం 15 శాతం ధర చెల్లించి పల్పర్లు పొందవచ్చునన్నారు. ఎలకా్ట్రనిక్‌ కాఫీ ప్పలర్లను ఉపయోగించుకుని రైతులు అత్యధిక కాఫీ పండ్లను పార్చిమెంట్‌గా తయారు చేసుకోవాలని సూచించారు. రైతులు తోటల్లో పండిన పండ్లను ఎప్పటికప్పుడు సేకరించుకుని పల్పింగ్‌ చేసుకుంటే నాణ్యమైన పప్పును పొందవచ్చునన్నారు. కాయలు, పండ్లు కలిపి పల్పింగ్‌ చేయరాదన్నారు. బాగా పండిన పండ్లను మాత్రమే పల్పింగ్‌ చేసుకోవాలన్నారు. పల్పింగ్‌ చేసుకున్న గింజలను సిమెంట్‌ కల్లాల్లో మాత్రమే ఎండబెట్టుకోవాలని తెలిపారు. ఈ నియమాలు పాటిస్తే మార్కెట్‌లో మంచి ధర పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి రమేశ్‌, ఏపీఎఫ్‌పీఎస్‌ జోనల్‌ మేనేజర్‌ సాయి శ్రీనివాస్‌, కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు జైతి ప్రభాకరరావు, ఇరిగేషన్‌ డీడీ రహీమ్‌, యూబీఐ మేనేజర్‌ పెనుమల నారాయణరావు, జేఎల్‌వో ఎస్‌.ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:40 AM