Share News

మత్స్యగుండం.. అభివృద్ధికి దూరం

ABN , Publish Date - Aug 27 , 2024 | 01:02 AM

పర్యాటక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన మత్స్యగుండం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఎంతో సుందరంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం అధ్వానంగా దర్శనమిస్తోంది. పర్యాటకానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచక భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి కొనసాగుతోంది.

మత్స్యగుండం.. అభివృద్ధికి దూరం
మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వర ఆలయం

గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం

భక్తులు, పర్యాటకుల అసంతృప్తి

గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో పలు పనులు

కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే పర్యాటక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని పలువురి అభిప్రాయం

(పాడేరు- ఆంధ్ర జ్యోతి)

పర్యాటక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన మత్స్యగుండం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఎంతో సుందరంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం అధ్వానంగా దర్శనమిస్తోంది. పర్యాటకానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచక భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి కొనసాగుతోంది.

మత్స్యగుండం గురించి 2002 సంవత్సరం వరకు స్థానికులకు మినహా ఇతర ప్రాంతాలకు అంతగా తెలియని పరిస్థితి. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర నేపథ్యంలో మత్స్యలింగేశ్వరుడ్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. క్రమంగా ఆ తర్వాత నుంచి మత్స్యగుండంపై ముమ్మర ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాలకు నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేవారు. దీంతో పర్యాటక పరంగా మత్స్యగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని 2003లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.కోటి వ్యయంతో మత్స్యకన్య, త్రిముఖశివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌, సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల గులాబీలతో పార్కును అభివృద్ధి చేశారు. కానీ ఆ తరువాత అధికారులు దాని నిర్వహణ, బాగోగులు పట్టించుకోలేదు. దీంతో కొన్నాళ్లకే మత్స్యగుండం అధ్వానంగా మారింది. ఆ తరువాత పుష్కరకాలానికి అంటే 2016లో వుడా (విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ఆధ్వర్యంలో మళ్లీ మత్స్యగుండం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సుమారు రూ.48 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా మత్స్యగుండం నిర్వహణపై అటు దేవదాయ శాఖగాని, ఇటు పర్యాటకశాఖ గాని దృష్టిసారించిన దాఖలాలు లేవు. దీంతో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా అక్కరకు రాని దుస్థితి కొనసాగుతున్నది.

పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మేలు

ప్రకృతి అందాలకు నిలయమైన గిరిజన ప్రాంతంలో పర్యాటకం పరంగా అభివృద్ధి చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని స్థానికులు, పర్యాటకులు అంటున్నారు. వాస్తవానికి మత్స్యగుండం వంటి ప్రాంతంలో అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రధానంగా భక్తి పరంగా జరిగే కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువుగా మందిరాలు, భక్తులు వంటలు, బస చేసేందుకు అనువుగా ఆశ్రమం తరహా నిర్మాణాలు చేపడితే, మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందుతుందని పలువురు అంటున్నారు. అలాగే పర్యాటకులను ఆకట్టుకునేలా విజ్ఞాన, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు సువిశాలమైన ప్రదేశంలో ఉన్న పార్కును అభివృద్ధి చేయడం, పర్యాటకులు బస చేసేందుకు అనువుగా చిన్న కాటేజీలు, భోజన సదుపాయానికి రెస్టారెంట్‌లు అందుబాటులోకి తీసుకువస్తే.. అరకులోయ నుంచి లంబసింగి వెళ్లే పర్యాటకులు పాడేరు ప్రాంతాన్ని సందర్శించి మత్స్యగుండంలో బస చేసేందుకు బాగుంటుందని సందర్శకులు చెబుతున్నారు. పర్యాటకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు ప్రత్యేక గుర్తింపుతోపాటు ఏజెన్సీకి మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశాలున్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం మత్స్యగుండం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పనులు

మత్స్యగుండం అభివృద్ధికి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని గుర్తించిన స్థానిక పెద్దలు, గ్రామాభివృద్ధికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని మత్స్యగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రిటైర్డ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తమర్భ అప్పారావు అధ్యక్షతన గ్రామాభివృద్ధి కమిటీ ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో మత్స్యగుండంలో సింహద్వారం, కేశఖండనశాల, కమిటీ కార్యాలయ భవనం, ఆలయానికి అవసరమైన పలు మెరుగులు దిద్దారు. అలాగే ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే చేపడుతున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మత్స్యగుండం మన్యంలో చక్కని పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు, పర్యాటకులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 27 , 2024 | 01:02 AM