Share News

భారీగా రైళ్ల రద్దు

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:18 AM

రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి.

భారీగా రైళ్ల రద్దు

జాబితాలో జన్మభూమి, రత్నాచల్‌, గోదావరి ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రధ్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, కోరమండల్‌...

నేటి నుంచి 7వ తేదీ వరకూ పలు సర్వీస్‌లు క్యాన్సిల్‌

బోసిపోయిన స్టేషన్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. విజయవాడ డివిజన్‌లో ముమ్మరంగా జరుగుతున్న రైల్వే లైన్ల అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరద నీరు ప్రవహించడం, ఇంకొన్ని ట్రాక్‌లు పాడవ్వడంతో విశాఖ నుంచి, విశాఖ మీదుగా వెళ్లే అనేక రైళ్లను వాల్తేరు డివిజన్‌ అధికారులు రద్దు చేశారు. ఆదివారం నుంచి మొదలైన రైళ్ల రద్దు మంగళవారం కూడా కొనసాగుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

మంగళవారం విశాఖ-హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రధ్‌ (12739), విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ (20708), విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ (20833), విశాఖ-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701), విశాఖ-మహబూబనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12861), సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ (20707), సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ (20834), సికింద్రాబాద్‌-షాలిమార్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12774), మహబూబ్‌నగర్‌-విశాఖ సూపర్‌ఫాస్ట్‌ (12862), తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు (08584), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12842), లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), హైదరాబాద్‌-కటక్‌ ప్రత్యేక రైలు (07165), బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12864) రద్దు చేశారు. 4న (బుధవారం) షాలిమార్‌-సికింద్రాబాద్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12773), న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20806), ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), తంబరం-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ (22842), ఎర్నాకులం-హటియా ధార్తి ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (22838), కటక్‌-హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07166), 5న ఎర్నాకులం-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18189), 6న హౌరా-మైసూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22817), కొచువేలి-షాలిమార్‌ ప్రత్యేక రైలు (06081), 7న కన్యాకుమారి-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12666), తిరువేలి-పురిలియా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22606)లను రద్దు చేసినట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

మళ్లింపు మార్గంలో; మంగళవారం విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20805) వయా విజయనగరం, రాయగడ, రాయపూర్‌, నాగపూర్‌ మీదుగా, హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) వయా పగిడిపల్లి, నల్గొండ, గుంటూరు మీదుగా నడుస్తాయి.

విశాఖ నుంచి వెళ్లే 12 రైళ్లు, విశాఖ మీదుగా వెళ్లే 19 రైళ్లు రద్దయ్యాయి. దాంతో ముందుగానే ప్రయాణాలు పెట్టుకున్నవారు, ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి, ఇక్కడి నుంచి గమ్యస్థానాలకు వెళ్లాలనుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం ముందుగా తెలుసుకున్నవారు ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఖాళీగా ఉంది. ఏ రైళ్లు రాకపోవడంతో ప్లాట్‌ఫారాలు బోసిపోతున్నాయి. ఇతర రైళ్లలో వచ్చి, మరో రైలు ఎక్కాల్సినవారు గత్యంతరం లేక ప్లాట్‌ఫారంపై కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.

నేడు విశాఖ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు

పలు రైళ్లు రద్దు అయిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం మంగళవారం విశాఖ నుంచి విజయవాడకు (ఒక వైపు) ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. 08581 నంబర్‌తో ఈ రైలు మధ్యాహ్నం 12.55 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 7.15 గంటలకు విజయవాడ చేరుతుందన్నారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిచే సమయంలో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు 16 సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌, రెండు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, రెండు ఏసీ చైర్‌కార్‌, రెండు సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజి కమ్‌ దివ్యాంగుల కోచ్‌లతో నడుస్తుందన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 01:18 AM