భారీ వాహనాలతో బేజారు!
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:09 AM
భారీ వాహనాలు పట్టపగలే జిల్లా కేంద్రంలోని రోడ్లపై ప్రమాదకరంగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అధిక లోడుతో క్వారీ లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసు, రవాణా శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండడం విమర్శలకు దారి తీస్తున్నది.

అనకాపల్లి రోడ్లపై రేయింబవళ్లు రాకపోకలు
ప్రమాదకరంగా క్వారీ లారీలు, టిప్పర్ల ప్రయాణం
పట్టణంలో తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్
ఛిద్రమవుతున్న రహదారులు
పట్టించుకోని పోలీసు, రవాణా శాఖల అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
భారీ వాహనాలు పట్టపగలే జిల్లా కేంద్రంలోని రోడ్లపై ప్రమాదకరంగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అధిక లోడుతో క్వారీ లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసు, రవాణా శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండడం విమర్శలకు దారి తీస్తున్నది.
జిల్లాలో ఎక్కడా లేనన్ని రోడ్డు మెటల్, కంకర క్వారీలు, స్టోన్ క్రషర్లు అనకాపల్లి మండలంలో ఉన్నాయి. నిత్యం రోడ్డు మెటల్, కాంక్రీట్‌కు వినియోగించే పిక్క ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకు రవాణా అవుతుంది. రాంబిల్లి మండలంలో ఏర్పాటవుతున్న ప్రత్యామ్నాయ నేవల్ బేస్‌లో సముద్ర తీరంలో జెట్టీ నిర్మాణం, అలలకు అడ్డుకట్ట వేసే పనుల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను మామిడిపాలెం, మార్టూరు, బవులువాడల్లోని క్వారీల నుంచి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం భారీ వాహనాలు, క్వారీ లారీలు, టిప్పర్లు వంటి రవాణా వాహనాలు పగటిపూట పట్ణణంలో నుంచి ప్రయాణించడానికి వీల్లేదు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించాలి. కానీ భారీ వాహనదారులు అనకాపల్లిలో ఈ నిబంధనలను పాటించడంలేదు. పోలీసులు సైతం పట్టించుకోవడంలేదు. దీంతో పట్టణంలోని పలు రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. భారీ వాహనాల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, హెచ్‌ఎన్‌ఆర్ అగ్రహారం, కుంచంగి, కూండ్రం, రొంగలివానిపాలెం, నర్సింగరావుపేటల్లో కంకర, రోడ్డు మెటల్ క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. నిత్యం రైల్వే అండర్ బ్రిడ్జి, నెహ్రూచౌక్ మీదుగా పదుల సంఖ్యలో క్వారీ లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నెహ్రూ చౌక్, పరిసరాల్లో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తున్నది. రాయి, పిక్క, క్రషర్ బుగ్గి రవాణా చేసే లారీలు, టిప్పర్ల కారణంగా దుమ్ము, ధూళి విపరీతంగా ఎగిసిపడుతున్నది. దీంతో ఈ వాహనాల వెనుక ప్రయాణించే వారితోపాటు ఎదురుగా వచ్చే వాహనాల్లోని వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వారీ లారీలు, టిప్పర్లకు గతంలో రాత్రిపూట మాత్రమే అనకాపల్లి పట్టణంలోకి అనుమతి ఉండేది. కానీ ఇటీవల కాలంలో క్వారీలు, స్టోన్ క్రషర్ల నిర్వాహకుల ఒత్తిడితో పోలీసు, రవాణా శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వేళాపాళా లేకుండా నిరంతరం క్వారీ లారీలు, టిప్పర్లు పట్టణ వీధుల్లో రాకపోకలు సాగిస్తున్నాయి.
రోడ్లు మరింత ఛిద్రం
క్వారీ లారీలు, టిప్పర్లలో 25 టన్నులకు పైబడి రాయి, పిక్క, స్టోన్ క్రషర్ బుగ్గిని రవాణా చేస్తున్నారు. అసలే అధ్వానంగా వున్న రహదారులు.. మరింత దారుణంగా తయారవుతున్నాయి. అనకాపల్లి మండలం మామిడిపాలెం, మార్టూరు, మాకవరంతోపాటు మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో రోడ్లు మొత్తం ఛిత్రం అవుతున్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం పది టైర్ల లారీలో 20 టన్నులు మాత్రమే రవాణా చేయాలి. కానీ క్వారీల నిర్వాహకులు అదనంగా పది నుంచి 15 టన్నులు లోడ్‌చేసి రవాణా చేస్తున్నారు. అయినాసరే రవాణా, పోలీసు శాఖల అధికారులు ఎక్కడా అడ్డుకుని కేసులు నమోదు చేసిన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. పోలీసు, రవాణా శాఖల జిల్లాస్థాయి అధికారులు అయినా స్పందించి, అధిక లోడుతో ప్రయాణించే క్వారీ, క్రషర్ల లారీలు, టిప్పర్లను ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అనకాపల్లి పట్టణంలోకి అనుమతించవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.