Share News

మరిడి మహాలక్ష్మి ఆభరణాలు అప్పగింత

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:49 AM

పట్టణంలోని మరిడి మహాలక్ష్మి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను దేవదాయ శాఖ అధికారులకు చింతకాయల సన్యాసిపాత్రుడు అప్పగించారు.

 మరిడి మహాలక్ష్మి ఆభరణాలు అప్పగింత
దేవదాయ శాఖ అధికారులకు మరిడి మహాలక్ష్మి ఆభరణాలను అప్పగిస్తున్న సన్యాసిపాత్రుడు

దేవదాయ శాఖ ఏసీ సమక్షంలో అందించిన సన్యాసిపాత్రుడు

రెండేళ్ల తర్వాత హుండీ ఆదాయం లెక్కింపు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 19 : పట్టణంలోని మరిడి మహాలక్ష్మి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను దేవదాయ శాఖ అధికారులకు చింతకాయల సన్యాసిపాత్రుడు అప్పగించారు. శుక్రవారం ఆలయంలో దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆభరణాల తనిఖీ విభాగం అధికారిణి దుర్గాభవానీ, కార్యనిర్వాహక అధికారి గంగారావు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ, పచ్చిగోళ్ల ఈశ్వరావు తదితరుల సమక్షంలో సన్యాసిపాత్రుడు నగలను అప్పగించి రశీదు తీసుకున్నారు. ఆయా నగలను అధికారులు తూకం వేశారు. ఐదు వందల పది గ్రాముల బంగారం, ఐదున్నర కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు సన్యాసిపాత్రుడు తెలిపారు.

ఇదిలావుంటే, దేవదాయ శాఖ అధికారులు మరిడి మహాలక్ష్మి ఆలయంలోని హుండీ ఆదాయాన్ని రెండేళ్ల తర్వాత లెక్కించారు. 2022 ఆగస్టు రెండో తేదీన ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. అప్పట్లో రెండు హుండీలకు సీల్‌ వేశారు. అప్పటి నుంచి హుండీల ఆదాయం లెక్కించ లేదు. శుక్రవారం తెరిచి ఆదాయం లెక్కించారు. రూ.2,53,738 వచ్చినట్టు కార్యనిర్వాహక అధికారి గంగారావు తెలిపారు. అమ్మవారి పేరు మీద బ్యాంక్‌ ఖాతా తెరిచి హుండీ ఆదాయం జమ చేశామన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:49 AM