Share News

మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రయోజనం శూన్యం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:43 AM

మావోయిస్టులు అవలంబిస్తున్న సిద్ధాంతాలతో ప్రజా జీవనానికి నష్టమేగాని ఎటువంటి ప్రయోజనం లేదని జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా అన్నారు.

మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రయోజనం శూన్యం
మాజీ మావోయిస్టులతో కలిసి భోజనం చేస్తున్న ఎస్‌పీ తుహిన్‌సిన్హా

ఆత్మీయ సమ్మేళనంలో ఎస్‌పీ తుహిన్‌సిన్హా

పాడేరు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు అవలంబిస్తున్న సిద్ధాంతాలతో ప్రజా జీవనానికి నష్టమేగాని ఎటువంటి ప్రయోజనం లేదని జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా అన్నారు. ఏజెన్సీలో వివిధ మావోయిస్టు పార్టీకి చెందిన దళాల్లో పని చేసి ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసి జీవనం సాగిస్తున్న 86 మంది మాజీ మావోయిస్టులతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల చర్యలతో ఏజెన్సీలో విధ్వంసం, గిరిజనుల జీవితాలు నాశనం కావడం మినహా ఎటువంటి మేలు జరగలేదన్నారు. మావోయిస్టు పార్టీలో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో? జనజీనవ స్రవంతిలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకునే అనేక మంది పార్టీని వీడి ప్రస్తుతం స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. ఇప్పటికీ అరకొరగా వున్న మావోయిస్టులు, వారి సానుభూతిపరులు తమకు లొంగిపోయి, చక్కని పునరావసం పొందాలని ఎస్‌పీ కోరారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు గ్రామాల్లోకి వస్తే ఎవరూ సహకరించవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్టుల యోగక్షేమాల అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి వంటపాత్రలను పంపిణీ చేసి, వారితో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు హిమగిరి, సుధాకర్‌, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:43 AM