పలు రైళ్లు ఆలస్యం
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:53 PM
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఆదివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అనకాపల్లిలో ప్రయాణికుల పడిగాపులు
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడడమే కారణం
అనకాపల్లి టౌన్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఆదివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడడంతో ఈ సమస్య చోటుచేసుకుంది. ఈ కారణంగా గ్రామీణ జిల్లాలోని పలు రైల్వేస్టేషన్‌ల్లో రైళ్లను గంటల తరబడి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం చెన్నై నుంచి హౌరా వెళ్లే మెయిల్ 6.40 గంటలకు అనకాపల్లికి రావాల్సి ఉండగా, 8.15 గంటలకు చేరుకుంది. విశాఖలో తలెత్తిన సమస్య కారణంగా ఆ రైలును అనకాపల్లిలో నిలిపివేసి 9.25 గంటలకు విశాఖకు విడిచిపెట్టారు. గుంటూరు నుంచి రాయగడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం ఎనిమిది గంటలకు రాగా, 9.34 గంటలకు అనకాపల్లి నుంచి విశాఖకు బయలుదేరింది. విశాఖకు వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ 10.25 గంటలకు రాగా, 10.47 గంటలకు బయలుదేరింది. అనకాపల్లిలో హాల్ట్ లేని సంబల్‌పూర్- నాందేడ్- సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్ 10.30 గంటలకు రాగా, 11.56 గంటలకు విడిచిపెట్టారు. ఉదయం 9.20 గంటలకు రావాల్సిన బొకారో ఎక్స్‌ప్రెస్ 10.50 గంటలకు విశాఖ నుంచి అనకాపల్లికి చేరుకుంది. మధ్యాహ్నం విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 1.40 గంటలకు అనకాపల్లికి రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 3.15 గంటలకు చేరుకుంది. ఇదిలా ఉండగా తాడి రైల్వేస్టేషన్‌లో కూడా మచిలీపట్నం- విశాఖ రైలు, సికింద్రాబాద్- విశాఖ గరీబ్‌రథ్ రైలు కూడా కొద్దిసేపు నిలిచిపోయినట్టు తెలిసింది. కాకినాడ పోర్టు నుంచి విశాఖకు వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్ కూడా బయ్యవరంలో కొద్దిసేపు నిలిపివేసిన తరువాత విశాఖకు వెళ్లినట్టు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గంటకు పైగా రైళ్లు ప్లాట్‌ఫారాలపై నిలిపివేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నాగావళి ఎక్స్‌ప్రెస్ రైలుకు అనకాపల్లిలో హాల్టు లేకపోయినా నిలిపివేయడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకటో ప్లాట్‌ఫారంలో కనీసం బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లు తప్ప మరే ఫలహారాలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. 11 గంటల తరువాత విశాఖలో విద్యుత్ తీగలు సరి చేయడంతో ఆ తరువాత నుంచి రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించాయి.