Share News

విశాఖ స్మృతిలో మన్మోహన్‌సింగ్‌

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:04 AM

విశాఖ వాసుల స్మృతిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిరస్థాయిగా నిలిచి ఉంటారు.

విశాఖ స్మృతిలో మన్మోహన్‌సింగ్‌

ప్రధానిగా మూడుసార్లు నగరానికి...

2006లో విశాఖ ఉక్కు విస్తరణ ప్రాజెక్టు

జాతికి అంకితం

2008లో ఏయూలో నిర్వహించిన 95వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు హాజరు

2009లో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ అరిహంత్‌ను ప్రారంభించేందుకు సతీసమేతంగా రాక

ఆయన మరణం దేశానికి తీరని లోటని పలువురి సంతాపం

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

విశాఖ వాసుల స్మృతిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్‌సింగ్‌ మూడు పర్యాయాలు విశాఖపట్నం వచ్చారు. రూ.8,692 కోట్లతో చేపట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణ ప్రాజెక్టును 2006 మే 20న ఆయన జాతికి అంకితం చేశారు. పోటీ మార్కెట్‌ను తట్టుకుని నిలబడేందుకు ఉక్కు కర్మాగారం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కర్మాగారం మరింత పురోభివృద్ధి చెందాలని, అందుకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని ప్రధాని హోదాలో ఆయన భరోసా ఇచ్చిన విషయాన్ని పలువురు కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. 2008లో రెండోసారి ఆయన నగరానికి వచ్చారు. దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు దిశానిర్దేశం చేసే 95వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2008 జనవరి మూడో తేదీన మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. యూజీసీ చైర్మన్‌గా మన్మోహన్‌సింగ్‌...అనేకమంది వర్సిటీ ఆచార్యులు, శాస్త్రవేత్తలతో కలసి పనిచేశారు. సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొని సహచర మిత్రులను పలకరించారు. రెండోసారి ప్రధాని అయిన తరువాత 2009 జూలై 26న భార్యతో కలిసి ఆయన విశాఖపట్నం విచ్చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను నేవల్‌ డాక్‌యార్డులో ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆప్యాయంగా పలకరించారని కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన మన్మోహన్‌సింగ్‌ మరణం తీరని లోటని పేర్కొంటూ ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

మన్మోహన్‌ సూచన మేరకు రైతుల ఆత్మహత్యలపై ఏయూ మాజీ వీసీ రొక్కం అధ్యయనం

దేశంలో రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ భారతం రుణగ్రస్తంపై అధ్యయనం చేసే బాధ్యతను ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి దివంగత రొక్కం రాధాకృష్ణకు ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ అప్పగించారు. ప్రధానిగా 2006లో విదర్భ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా అక్కడ రైతుల దుస్థితిని తెలుసుకున్న మన్మోహన్‌...తన సహచర మిత్రుడు, ఆర్థికవేత్త రొక్కం రాధాకృష్ణను స్వయంగా ఢిల్లీ పిలిపించి (విశాఖలో రాధాకృష్ణ ఉన్నప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి ఒక అధికారి ఫోన్‌ చేశారు) రుణగ్రస్త గ్రామీణ ప్రాంతాలు, ఆత్మహత్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. దీంతో రాధాకృష్ణ తన బృందంతో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి 2007లో కేంద్రానికి నివేదిక పంపారు. నివేదిక రూపకల్పనలో ఏయూ నుంచి కొందరు స్కాలర్లు పనిచేశారని రాధాకృష్ణ బంధువు, నెల్లూరు విక్రం సింహపురి మాజీ వీసీ ఆచార్య రొక్కం సుదర్శనరావు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తిగా మన్మోహన్‌సింగ్‌ ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతారంటూ ఆయన మృతికి నివాళులు అర్పించారు.

Updated Date - Dec 28 , 2024 | 01:04 AM