పాఠశాలలకు యాజమాన్య కమిటీలు
ABN , Publish Date - Aug 02 , 2024 | 12:54 AM
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గాడి తప్పిన విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల్లో సమూల మార్పులు తెచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలను మార్చాలని నిర్ణయించింది. తల్లిదండ్రుల కమిటీల పదవీకాలం పూర్తి కావడంతో వాటి స్థానాల్లో కొత్తగా పాఠశాల యాజమాన్య (స్కూల్ మేనేజ్‌మెంట్) కమిటీలను ఏర్పాటు చేయనుంది.
- ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రుల కమిటీలు రద్దు
- జిల్లాలో 1,424 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
- 8న ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గాడి తప్పిన విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల్లో సమూల మార్పులు తెచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలను మార్చాలని నిర్ణయించింది. తల్లిదండ్రుల కమిటీల పదవీకాలం పూర్తి కావడంతో వాటి స్థానాల్లో కొత్తగా పాఠశాల యాజమాన్య (స్కూల్ మేనేజ్‌మెంట్) కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. జిల్లాలో 1,424 పాఠశాలలు ఉండగా, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 2,13,190 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ లక్ష్మమ్మ నేతృత్వంలో ఆయా పాఠశాలల్లో గతంలో వున్న తల్లిదండ్రుల కమిటీలను రద్దు చేస్తూ కొత్తగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికల కోసం గురువారం షెడ్యూల్ ప్రకటించారు.
8న ఎన్నికలు
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల నియామకాల కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాలల నోటీసు బోర్డులపై ఎన్నికల షెడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన రోజునే కమిటీల ప్రమాణస్వీకారం, తొలి సమావేశాలు నిర్వహించనున్నారు.
పోటీకి నిబంధనలు ఇవీ..
పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లు, సభ్యులుగా పోటీ చేసేవారు స్థానికులై ఉండాలి. వారి పిల్లలు తప్పనిసరిగా అదే పాఠశాలలో చదువుతుంటేనే తండ్రికి కమిటీలో అర్హత కల్పిస్తారు. కమిటీల నేతృత్వంలోనే ఇకపై పాఠశాలలో మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల కల్పన పనుల పర్యవేక్షణ ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 8న యాజమాన్య కమిటీల నియామకాల కోసం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని డీఈవో ఎంవీ లక్ష్మమ్మ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలు సజావుగా జరిగేలా మండల విద్యాశాఖాధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు, మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు.