నక్కపల్లికి మహర్దశ
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:18 AM
పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలానికి మహర్దశ పట్టనున్నది.
మెగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు సంసిద్ధత
మొత్తం పెట్టుబడులు రూ.1.4 లక్షల కోట్లు
మొదటి దశలో రూ.70 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో వేగంగా స్పందించిన ప్రముఖ స్టీల్ కంపెనీలు
అందుబాటులో వీసీఐసీ భూములు
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో శంకుస్థాపన?
సాకారం అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి
జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు
నక్కపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలానికి మహర్దశ పట్టనున్నది. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో భారీ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. ప్రైవేటు రంగంలో సుమారు 1.4 లక్షల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి భారత్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కొద్ది రోజుల్లోనే ఈ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై, మిగిలిన అంశాల గురించి చర్చిస్తారని సమాచారం. లాంఛనాలన్నీ పూర్తయితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తారని తెలిసింది. నక్కపల్లి మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించడంతో నియోజకవర్గం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గాన్ని ప్రగతిబాటలో నిలిపి, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని తొమ్మిదేళ్ల ఏళ్ల కిందటే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.. నవ్యాంధ్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. పాయకరావుపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో 2015లో ‘విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ (వీసీఐసీ) పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబుపై వున్న నమ్మకంతో నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. అప్పట్లో జిరాయితీతోపాటు డి.పట్టా భూములకు కూడా ప్రభుత్వం సంతృప్తికరమైన పరిహారం ఇచ్చింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఇండస్ర్టియల్ కారిడార్‌ను నాలుగేళ్లపాటు పట్టించుకోలేదు. గత ఏడాది ఇక్కడ బల్స్ డ్రగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కార్యరూపం దాల్చలేదు. తరువాత ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రైవేటు రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. లోకేశ్ అమెరికా పర్యటనలో వున్నప్పుడు పలువురు ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తలతో జూమ్ కాన్ఫరెనన్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ సానుకూలంగా స్పందించాయి. లక్షా 40 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. రూ.70 వేల కోట్లతో మొదటి దశ నిర్మాణం చేపడతారు. ఉక్కు ఫ్యాక్టరీ మొదటి దశ ఏర్పాటుకు 2,640 ఎకరాల భూములు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. నక్కపల్లి మండలంలో ‘విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం ఇప్పటికే భూములు సేకరించి వున్నందున కొత్తగా భూ సేకరణ చేపట్టాల్సిన పనిలేదు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు మండలంలోని రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, ఎన్.నర్సాపురం, వేంపాడు, డీఎల్‌పురం రెవెన్యూ గ్రామాల్లోని వీసీఐసీ భూములు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడానికి విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాలు అందుబాటులో వున్నాయి. ముడి సరకు దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతుల కోసం నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద శాటిలైట్ పోర్టు నిర్మాణం చేపట్టే అవకాశం వుంది. ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తి చేసే కంపెనీల్లో రెండో స్థానంలో వుంది.
కాగా మన దేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం భారీ మొత్తంలో అందుబాటులో వుండడంతో తమ దేశ అవసరాల కోసం ఉత్తమ శ్రేణి ఉక్కు ఉత్పత్తి కోసం నక్కపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన నిప్పన్ కంపెనీ ఆసక్తిగా వున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. భారత్‌లో ముడిసరకు, మానవ వనరులు పుష్కలంగా వుండడంతోపాటు జపాన్‌తో పోలిస్తే భారత్‌లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తక్కువగా వుండడంతో నిప్పల్ స్టీల్ కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు తెసింది. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడి ఖనిజం, ఇతర ముడి సరకులను ఎన్‌ఎండీసీ సరఫరా చేసే అవకాశం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొదటి దశ నిర్మాణ పనులను 2029నాటికి పూర్తి చేస్తామని మిట్టల్ సంస్థ పేర్కొంది. మొదటి దశ పనులు పూర్తయితే రెండో దశ పనులకు 3,800 ఎకరాల భూములు కావాల్సి వుంటుందని మిట్టల్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేటు సంస్థ కావడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సదుపాయాలు శరవేగంగా సమకూర్చే అవకాశాలు వుండడంతో ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. కాగా నక్కపల్లి మండలంలో మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటైతే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పాయకరావుపేట నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆశిస్తున్నారు.