Share News

రైవాడకు మహర్దశ

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:49 AM

రైవాడ జలాశయం అభివృద్ధి గురించి శాసనసభ సమావేశాల్లో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సత్వరమే స్పందించింది. కేంద్ర నీటి సంఘం (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌.. సీడబ్ల్యూసీ) నిపుణుల బృందం బుధవారం రైవాడ రిజర్వాయర్‌ను పరిశీలించింది.

రైవాడకు మహర్దశ
రైవాడ జలాశయాన్ని సందర్శిస్తున్న సీడబ్ల్యూసీ నిపుణుల బృందం

జలాశయాన్ని సందర్శించిన సీడబ్ల్యూసీ నిపుణుల బృందం

‘డ్రిప్‌’ కింద అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

రూ.336 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ

ఎమ్మెల్యే బండారు కృషితో తొలి అడుగు

దేవరాపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైవాడ జలాశయం అభివృద్ధి గురించి శాసనసభ సమావేశాల్లో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సత్వరమే స్పందించింది. కేంద్ర నీటి సంఘం (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌.. సీడబ్ల్యూసీ) నిపుణుల బృందం బుధవారం రైవాడ రిజర్వాయర్‌ను పరిశీలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హరియాణాకు చెందిన సాంకేతిక నిపుణులు అఖిలేశ్‌, ఈజిప్టు దేశానికి చెందిన సివిల్‌ ఇంజనీరింగ్‌లో నిపుణుడు హనీతోపాటు రాష్ట్ర జల వనరుల శాఖ సీఈ ఎస్‌.సుగుణాకరరావు, ఎస్‌ఈ యాస్టికా, ఈఈలు విజయానంద్‌, త్రినాథం జలాశయాన్ని సందర్శించారు. స్పిల్‌వే, కుడి, ఎడమ కాలువలు, మదుములు, రెగ్యులేటింగ్‌ గేట్లు ఎగువ, దిగువ భాగాలను పరిశీలించారు. జలాశయం పరిస్థితుల గురించి డీఈఈ సత్యంనాయుడు, ఏఈఈలు నందకిశోర్‌, రవిప్రకా్‌శ్‌, నాగేంద్ర, శాంతి వివరించారు. వీటిని నిపుణుల బృందం నమోదు చేసుకుంది. అంతకుముందు రైవాడ అతిథిగృహంలో జరిగిన భేటీలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రైవాడ రిజర్వాయర్‌ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి త్వరితగతిన నివేదికను రూపొందించి కేంద్రానికి పంపాలను నిపుణుల బృందాన్ని కోరారు. పనులకు అవసరమైన నిధులను సీఎం చంద్రబాబుతోపాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఉనికి కోల్పోకుండా వాటిని కాపాడుకోవడానికి కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డీఆర్‌ఐపీ.. డ్రిప్‌) కింద రాష్ట్రంలో శ్రీశైలం, ధవళేశ్వరం, రైవాడ ప్రాజెక్టును రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ఇందులో రూ.336 కోట్లతో రైవాడ జలాశయం ఆధునికీకరణ, విస్తరణ, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపామని, సాంకేతిక ఆమోదం లభించాల్సి వుందని బండారు చెప్పారు. ఇందులో భాగంగానే నిపుణుల బృందం రైవాడ జలాశయాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. కాగా పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత రైవాడ నుంచి జీవీఎంసీకి నీటి సరఫరా అవసరం వుండదని, ఆ నీటిని కూడా రైతులకే సరఫరా చేస్తామని, తద్వారా ఆరు వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:50 AM