Share News

బొర్రా గుహలకు మహర్దశ

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:27 AM

బొర్రా గుహలకు మహర్దశ

బొర్రా గుహలకు మహర్దశ

కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్‌’లో రూ.29.88 కోట్లు కేటాయింపు

అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాన మోదీ

పర్యాటకులకు మెరుగుపడనున్న సదుపాయాలు

మరింత పెరగనున్న సందర్శకులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

లక్షల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడి రెండు శతాబ్దాలుగా పర్యాటకాదరణ పొందుతున్న బొర్రా గుహలకు మహర్దశ పట్టింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వదేశీ దర్శన్‌’ కార్యక్రమంలో బొర్రా గుహలుకు చోటు దక్కింది. రూ.29.88 కోట్లతో బొర్రా గుహల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ దర్శన్‌ కింద దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో బొర్రా గుహలు ఒకటి కావడం విశేషం.

ఆంగ్లేయుల పాలనలో 1807లో బ్రిటీష్‌ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్‌ కనుగొనే వరకు బొర్రా గ్రామం వద్ద గుహలు వున్నట్టు బాహ్య ప్రపంచానికి తెలియదు. సుమారు 1500 మీటర్ల లోతు ఉన్న బొర్రా గుహలు పైభాగం నుంచి పడే నీటి చుక్కలు కింది భాగంలో స్టాలక్‌లైట్స్‌గా మారి రాతి శిలలుగా ఏర్పడ్డాయి. దీంతో పలు రకాల ఆకృతులు ఏర్పడి సందర్శకుల ఆదరణను పొందుతున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడి, అందమైన ఆకృతులతో చూపరుల మనసు దోచే బొర్రా గుహలను సందర్శించడానికి దేశవిదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. అద్భుతమైన ప్రకృతి సంపదను తిలకించే పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ముఖ్యంగా పర్యాటక సీజన్‌ అక్టోబరు నుంచి జనవరి వరకు, వేసవి సెలవుల్లో అధికంగా వస్తుంటారు.

మూడు దశాబ్దాల క్రితం వరకు కాడగాలతోనే సందర్శన

మూడు దశాబ్దాల క్రితం వరకు బొర్రా గుహలను కాగడాల వెలుగులోనే సందర్శించాల్సి వచ్చేది. స్థానిక గిరిజన యువకులు గైడ్లుగా వ్యవహరిస్తూ, కాగాడాలు పట్టుకుని పర్యాటకులకు గుహలను చూపించేవారు. తర్వాత ఐటీడీఏ ఆధీనంలోకి తీసుకొని ప్రవేశ రుసుం ద్వారా వచ్చే ఆదాయంలో స్థానికులకు కొంత మొత్తం ఇస్తూ, గుహలను అభివృద్ధి చేసింది. తర్వాత 1992లో పర్యాటక శాఖ ఆఽధీనంలోకి తీసుకొని 1993లో విద్యుదీకరణ పనులు చేపట్టింది. అనంతరం కాలంలో గుహలలోకి నడిచేందుకు వీలుగా పాత్‌వేలు, మెట్లు, రెయిలింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏటా మూడు లక్షల మంది పర్యాటకులు గుహలను సందర్శిస్తున్నారు.

ఆదాయం ఘనం.. సౌకర్యాలు అంతంతమాత్రం!

బొర్రా గుహల ప్రవేశ రుసుం ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది. కానీ పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించడంలేదని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని సందర్శకులు అంటున్నారు. గుహల ప్రారంభం వద్ద మెట్లు నిటారుగా, చాలా ఇరుకుగా ఉండడంతోపాటు గుహల్లోకి వెళ్లేవారికి, తిరిగి వచ్చేవారికి ఇదే దారి కావడంతో తీవ్ర అసౌకర్యంగా వుంటున్నది. రద్దీ సమయాల్లో తోపులాట చోటు చేసుకుంటున్నది. ఇక్కడ కూడా సమయం వృథా అవుతున్నది. అదే విధంగా గుహల లోపల రెండుచోట్ల కూడా దారి చాలా ఇరుకుగా వుంది. ఒక్కో మనిషి మాత్రమే వెళ్లగలిగేటంత స్థలం వుండడంతో కొద్దిసేపు లోపలికి వెళ్లేవారు, మరికొద్దిసేపు బయటకు వచ్చే వారు రాకపోకలు సాగించాల్సి వస్తున్నది. సాధారణ సమయాల్లో గుహలను సందర్శించడానికి గంట సమయం సరిపోతుంది. కానీ పర్యాటక సీజన్‌లో రెండు మూడు గంటలకుపైగా పడుతున్నది. మెట్ల మార్గాన్ని, గుహల్లో ఇరుకువున్న దారిని వెడల్పు చేయాలన్న ప్రతిపాదన కాగితాలపైనే వుంది అదే విధంగా పర్యాటకుల వాహనాలను నిలుపుదల చేయడానికి తగిన స్థలం లేదు.

స్వదేశీ దర్శన్‌తో మహర్దశ

స్వదేశీ దర్శన్‌లో భాగంగా బొర్రా గుహలు, చుట్టుపక్కల ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నారు. గుహల్లో మరిన్ని లైట్లు ఏర్పాటు చేస్తారు. టికెట్‌లు తీసుకోవడం, క్యూలైన్‌లో వెళ్లడం వంటి వాటిని మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేస్తారు. రైల్వేస్టేషన్‌ నుంచి గుహలు వరకు రహదారిని అభివృద్ధి చేస్తారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతారు. గేటువలస జంక్షన్‌ నుంచి గుహలకు వచ్చే మార్గంలో హోటళ్ల జంక్షన్‌ వద్ద రోడ్డును విస్తరించి, గెడ్డపై కొత్త వంతెన నిర్మిస్తారు. గుహల లోపల ఇరుకుగా వున్న ప్రదేశంలో సహవ వనరులు దెబ్బతినకుండా ప్రత్యామాయ నడకమార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:27 AM