పెందుర్తి- అరకు రోడ్డుకు మహర్దశ
ABN , Publish Date - Aug 19 , 2024 | 01:08 AM
జిల్లాలోని పెందుర్తి జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా కొత్తవలస మీదుగా ఉన్న బౌడారా రహదారి ఎన్‌హెచ్ 516 విస్తరణకు మోక్షం లభించనుంది.
రూ.935.76 కోట్లతో బౌడారా రోడ్డు విస్తరణకు మోక్షం
పెందుర్తి, ఆగస్టు 18:
జిల్లాలోని పెందుర్తి జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా కొత్తవలస మీదుగా ఉన్న బౌడారా రహదారి ఎన్‌హెచ్ 516 విస్తరణకు మోక్షం లభించనుంది. భారతమాల పరియోజన పథకం కింద సుమారు 45 కిలోమీటర్ల మేరరోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారికి 516బి నంబరు కేటాయించి, నాలుగు వరసలుగా అభివృద్ధి చేయనున్నారు.
పెందుర్తి నుంచి కొత్తవలస, శృంగవరపు కోట మీదుగా బౌడారా రోడ్డు వద్ద 516ఈ జాతీయ రహదారిని కలిపే విధంగా రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం భూసేకరణ, పునరావాసం, నిర్మాణానికి రూ.935.76 కోట్లు ఖర్చవుతుందని జాతీయ రహదారి సంస్థ అంచనా వేసింది. 2023లోనే ఈ రోడ్డు పనులకు ఆమోదం లభించినా ఇప్పటివరకు కేవలం రూ 11.81 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రస్తుతం ఈ రహదారిలో రూ.782 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 28న కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొదటి విడతగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు కేంద్రప్రభుత్వం రూ.181.22 కోట్లు కేటాయించింది.
ఆదిలోనే సర్వేకు అడ్డగింత
రహదారి విస్తరణకు సంబంధించి గత ఏడాది డీపీఆర్ మ్యాపింగ్ సర్వే చేపట్టారు. మండలంలోని సరిపల్లిలో జాతీయ రహదారుల సంస్థ, రెవెన్యూ సర్వే సిబ్బంది మార్కింగ్ రాళ్లను వేశారు. తమ భూములు, ఆస్తులపై సర్వే చేస్తున్నారనే సమాచారంతో బాధితులు అడ్డుకున్నారు. ప్రాథమిక సర్వే అని సిబ్బంది తెలిపినా వినిపించుకోలేదు. దీంతో పాటు రోడ్డు మధ్య నుంచి కుడివైపున 90 అడుగులు, ఎడమవైపు 40 అడుగులు విస్తరణ చేపట్టడం దారుణమన్నారు. దీనిపై కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం నిధుల కేటాయింపు జరగడంతో పనుల్లో కదలిక వస్తుందని భావిస్తున్నారు. నిర్మాణ పనులపై అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం.